తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లరు. ప్రగతిభవన్ లేదంటే ఫాంహౌస్‌లో వుంటారని కేసీఆర్‌పై గత 8 ఏళ్లుగా ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సచివాలయానికి కేసీఆర్ వెళ్లకపోవడానికి గల కారణం ఆయనకు మాత్రమే తెలుసు. కొత్త సచివాలయ నిర్మాణం వేగంగా జరగుతోంది.
ఒకట్రెండుసార్లు కేసీఆర్ నేరుగా వెళ్లి కొత్త సచివాలయ నిర్మాణ పనులు పర్యవేక్షించారు. కేసీఆర్ సచివాలయానికి వెళ్లకపోవడం గురించి మరోసారి చర్చకు వచ్చింది. తెలంగాణ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు తెరలేచాయి.
హైదరాబాద్ (తుక్కుగూడ)లో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘మీరెప్పుడూ సచివాలయానికి వెళ్లరు. అందులో అడుగు పెడితే అధికారం పోతుందని ఎవరో మాంత్రికుడు చెప్పారట. కానీ, నేను చెబుతున్నా.. మీ ప్రభుత్వం గద్దె దిగడానికి మాంత్రికుడు అక్కర్లేదు. తెలంగాణ ప్రజలే మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూలదోస్తారు’ అని కేసీఆర్‌ను అమిత్‌షా హెచ్చరించారు.
కేసీఆర్‌కు మతపరమైన విశ్వాసాలు ఎక్కువే. గతంలో కేసీఆర్ రకరకాల యోగాలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సచివాల యానికి వెళ్లకపోవడం, తాజాగా అమిత్‌షా మాంత్రికుడి హెచ్చరిక వల్లే ఆయన అక్కడికి వెళ్లలేదనే సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అమిత్‌షా చెప్పిందే నిజమోనేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచి వాలయానికి వెళితే పదవీ గండం ఉందనే మాంత్రికుడి హెచ్చరిక వల్లే ప్రగతి భవన్‌కు సీఎం కేసీఆర్ పరిమితమయ్యారనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇందుకు అమిత్‌షా ఆరోపణలు బలం చేకూర్చుతున్నాయి.
రాజకీయంగా, మానసికంగా ఎంతో శక్తిమంతుడైన కేసీఆర్ …విశ్వాసాల విషయానికి వచ్చే సరికి ఆచితూచి వ్యవహరిస్తు న్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌షా ఆరోపణల్లో నిజం లేకపోతే, కేసీఆర్ సచివాలయానికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లే కరువయ్యారు. ఏది ఏమైనా అమిత్ షా తన పర్యటనలో మాంత్రికుడి ప్రస్తావనతో తేనె తుట్టెను కదిలించినట్టైంది.