తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే కాదు, అన్న వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఈ ప్రచారానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజా అభిప్రాయం బలాన్ని ఇస్తోంది. మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై సంచలన విషయాలు చెప్పారు.
తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమతో టచ్‌లో ఉన్నారని రాజకీయ బాంబు పేల్చారు. బీజేపీ, ప్రధాని మోదీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారని గుర్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని సంచలన విషయాలు చెప్పారు.
ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై వివాదం తలెత్తింది. తన సోదరుడిని రాజకీయంగా విమర్శిస్తే అభ్యంతరం లేదని, కానీ తమ కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేయడం తెలిసిందే.
తాను కరడుగట్టిన కాంగ్రెస్ వాదినని, రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారని వెంకటరెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా టీడీపీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిలో రేవంత్‌రెడ్డి ఏడాది పాటు కొనసాగిన విషయాన్ని వెంకటరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను రెచ్చగొట్టి, ఇద్దరినీ పార్టీ నుంచి బయటికి పంపడానికి రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం.
ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో వెంకటరెడ్డి ఇరకాటంలో పడ్డట్టైంది. ఇదే రేవంత్ కూడా కోరుకుంటున్నారు. రాజగోపాల్‌తో పాటు వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వెళితే తనకు అడ్డు వుండదనే భావనలో రేవంత్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని బండి సంజయ్ భావిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేలా బండి సంజయ్ వ్యూహాత్మకంగా వెంకటరెడ్డితో అనుబంధంపై కామెంట్స్ చేస్తున్నారనే చర్చకు దారి తీసింది.