అధికారంపై ఆశ‌లు వ‌దులుకుందా?

తెలంగాణ‌లో బీజేపీది వాపే త‌ప్ప‌, బ‌లం కాద‌ని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. అందుకే జ‌న‌సేన‌తో సైతం పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆస‌క్తి చూపుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీ 52 మందితో మొద‌టి జాబితా ప్ర‌క‌టించింది. రెండో…

తెలంగాణ‌లో బీజేపీది వాపే త‌ప్ప‌, బ‌లం కాద‌ని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. అందుకే జ‌న‌సేన‌తో సైతం పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆస‌క్తి చూపుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీ 52 మందితో మొద‌టి జాబితా ప్ర‌క‌టించింది. రెండో జాబితాపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌తో పొత్తు అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తెలంగాణ‌లో ప‌దిలోపు సీట్లు జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సామాజిక వ‌ర్గం ఓట్ల కోసం జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటుంద‌ని అంటున్నారు. ఇంత‌కాలం జన‌సేన‌ను ఆంధ్రా పార్టీగా భావించి బీజేపీ ప‌క్క‌న పెట్టింది. అయితే తెలంగాణ‌లో 32 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ద్ద‌కు బీజేపీ నేత‌లు కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ వెళ్లి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

జ‌న‌సేనాని మాత్రం త‌మ‌కు కొన్ని సీట్లు ఇవ్వాల‌ని అడిగిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ఈ ద‌ఫా పోటీ చేయాల్సిందే అని త‌న‌పై ఒత్తిడి వుంద‌ని బీజేపీ నేత‌ల‌కు ప‌వ‌న్ చెప్పారు. ప‌వ‌న్‌తో పొత్తు వుంటే ఎలా? లేక‌పోతే ఎలా? అని బీజేపీ నేత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డ్డారు. చివ‌రికి 10 సీట్లు ఇచ్చి పొత్తుకే మొగ్గు చూపార‌ని స‌మాచారం. 

తెలంగాణ‌లో అధికారంపై బీజేపీ ఆశ‌లు వ‌దులుకుంద‌నేందుకు జ‌న‌సేన‌తో పొత్తుకు మొగ్గు చూపడ‌మే ఉదాహ‌ర‌ణ‌. ఎటూ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని, ఆ మాత్రం సంబ‌రానికి ఆంధ్రా, తెలంగాణ అంటూ జ‌న‌సేన‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఎందుకులే అని బీజేపీ నేత‌లు ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. తెలంగాణ‌లో రెండు నెల‌ల క్రితం వ‌ర‌కూ బీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని చూశారు. అయితే అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల దృష్ట్యా బీజేపీ బ‌ల‌హీన ప‌డి, కాంగ్రెస్ ఒక్క‌సారిగా బ‌ల‌ప‌డింది. 

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య పోరు హోరాహోరీని త‌ల‌పిస్తోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య బీజేపీ అస‌లు ఉనికిలో లేకుండా పోయింది. బీఆర్ఎస్‌ను కాద‌నుకుంటే ఎవ‌రైనా కాంగ్రెస్ వైపే మొగ్గుతున్నారు. ఇక సీట్లు, అధికారంతో సంబంధం లేని పార్టీలు, నాయ‌కులు మాత్రం బీజేపీతో క‌లిసి ప్ర‌యాణించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ కోణంలో చూస్తే బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు ఎందుకో అర్థం చేసుకోవ‌చ్చు.