పవన్ కోసం అంత వెంపర్లాట.. చేటు చేయదా?

2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఆరోజునుంచి ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడు కూడా.. వారిద్దరూ భాగస్వామి పార్టీల్లాగా వ్యవహరించింది లేదు. కలిసి పోరాడింది లేదు.…

2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఆరోజునుంచి ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడు కూడా.. వారిద్దరూ భాగస్వామి పార్టీల్లాగా వ్యవహరించింది లేదు. కలిసి పోరాడింది లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. జనసేన అస్తిత్వాన్ని బిజెపి ఏనాడూ గుర్తించలేదు. పైపెచ్చు వారితో పొత్తు బంధం, ఎన్డీయే భాగస్వామి బంధం అనేది ఏపీ రాజకీయాల వరకు మాత్రమే పరిమితం అంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ వచ్చారు. 

తీరా ఇప్పుడు ఎన్నికల సీజను వచ్చేసరికి పవన్ కల్యాణ్ సాయం కోసం భాజపా ఎగబడుతోంది. నీవే తప్ప ఇతః పరంబెరుగ.. కావవే వరద అన్నట్టుగా.. పవన్ కల్యాణ్ దయ కోసం ఆరాటపడుతోంది. వారి ఆరాటం చూస్తున్న వారికి మాత్రం జాలి కలుగుతోంది. కమల నాయకులు ఊహించుకుంటున్న స్థాయిలో అసలు పవన్ కల్యాణ్ కు తెలంగాణలో సీనుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కిషన్ రెడ్డి పడుతున్న ఆరాటం చూసి పార్టీవర్గాల్లో కూడా కొందరు.. లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరో కోణంలోంచి గమనించినప్పుడు.. అసలు బిజెపిని పవన్ పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు లేదు. జనసేనతో కలిసి పోటీచేయడం కోసం కిషన్ రెడ్డి తదితరులు తొలిసారి వెళ్లి ఆయనను కలిసిన తర్వాత.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతోభేటీ అయ్యారు. మంతనాలు సాగించారు. తిరిగి వచ్చారు. అయితే.. ఆ భేటీలో.. ఒకటి రెండు రోజుల్లోగా జనసేన కోరుకునే సీట్ల సంగతి.. పంపకాల సంగతి పూర్తిగా తేల్చాలని అమిత్ షా నిర్దేశించినట్లు వార్తలు వచ్చాయి. అమిత్ షా సూచనలను పవన్ కల్యాణ్ బేఖాతరు చేశారు. అస్సలు పట్టించుకోలేదు.

నిజానికి అంతకు చాలాకాలంముందే తెలంగాణలో తాము 32 స్థానాల్లో పోటీచేస్తాం అంటే జనసేన సీట్ల జాబితాను ప్రకటించింది. ఆల్రెడీ లిస్టు చేతిలో ఉన్నది గనుక.. బిజెపితో ఎన్నిసీట్లు దక్కుతాయో తెలుసుకుని.. ఆ లిస్టులోంచి వాటిని పిక్ చేసుకోవడం పెద్ద సంగతి కాదు. 

అయితే పవన్ కల్యాణ్ బిజెపికి ఉన్న ఒత్తిడిని పట్టించుకోకుండా.. సీట్ల సర్దుబాటు తేల్చుకుండా తనంతట తాను ఇటలీ వెళ్లిపోయారు. తిరిగి వచ్చారు. రాగానే ఆయన ఉత్సాహంగా చంద్రబాబును కలవడానికి వెళ్లారు. ఆయన ప్రాపకం కోసం కిషన్ రెడ్డి , లక్ష్మణ్ స్వయంగా ఆయన వద్దకే వచ్చి కలిశారు. తమాషా ఏంటంటే.. ఇప్పటికీ సీట్ల సర్దుబాటు తేలలేదు. ఒకటిరెండు రోజుల్లో డిసైడ్ చేస్తాం అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ మాట చెబితే చాలు.. తెలంగాణ ప్రజలు యావత్తూ గంపగుత్తగా ఓట్లు వేసేస్తారన్నట్టుగా.. ఆయన కోసం బిజెపి పార్టీ ఆరాటపడుతుండడం చవకబారుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.