హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఆమె ప్రసంగానికి 25 నిమిషాల సమయాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం కేటాయించడం విశేషం.
తనకిచ్చిన సమయంలో ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ అప్రజాస్వామిక పాలన, ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఉన్న అవకాశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ఇతర పార్టీల నుంచి ప్రజాదరణ కలిగిన నేతలను తీసుకురావడం తదితర అంశాలపై డీకే అరుణ ప్రసంగించే అవకాశాలున్నాయని తెలిసింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డీకే అరుణకు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. కాంగ్రెస్ నాయకురాలిగా సుదీర్ఘం కాలం పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆమె ఆశించారు. కానీ టీఆర్ఎస్కు తెలంగాణ సమాజం పట్టం కట్టింది. కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకించే నాయకురాలిగా డీకే అరుణకు గుర్తింపు వుంది.
తెలంగాణలో రాజకీయాలు మారిన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ప్రోత్సహించింది. రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని డీకే అరుణ బలంగా నమ్ముతోంది. అంతేకాదు, బీజేపీ కార్యకర్తలను సమరానికి సన్నద్ధం చేస్తున్నారామె.
రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, పెద్దరికంగా మసలుకునే డీకే అరుణ పంథా బీజేపీ అగ్రనేతలను ఆకట్టుకుంది. అందుకే ఆమె ప్రసంగానికి 25 నిమిషాల సమయాన్ని కేటాయించారనే చర్చకు తెరలేచింది.