విజ‌య‌శాంతికి షాక్‌!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి ఆ పార్టీ గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల ముంగిట విజ‌య‌శాంతిని బీజేపీ విస్మ‌రించ‌డం వెనుక అస‌లేం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీలో కొంత‌కాలంగా విజ‌య‌శాంతి తీవ్ర…

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి ఆ పార్టీ గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల ముంగిట విజ‌య‌శాంతిని బీజేపీ విస్మ‌రించ‌డం వెనుక అస‌లేం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీలో కొంత‌కాలంగా విజ‌య‌శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్‌ని త‌ప్పించిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీ కార్య‌క‌లాపాల‌కు విజ‌య‌శాంతి దూరంగా వుంటున్నారు.

కొంత కాలంగా ఆమె మౌనంగా వుండ‌డంతో ప‌లు ర‌కాల ప్ర‌చారాలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌లో విజ‌య‌శాంతి చేరుతార‌ని, మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌హుశా విజ‌య‌శాంతి పార్టీ మార్పుపై బీజేపీ అధిష్టానానికి ఏవైనా సంకేతాలు అందాయేమో తెలియ‌దు కానీ, ఇవాళ విడుద‌ల చేసిన స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో ఆమె పేరు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి 40 మంది నేత‌లు వెళ్ల‌నున్న‌ట్టు బీజేపీ జాబితా ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, అమిత్‌షా త‌దిత‌ర కేంద్ర పెద్ద‌ల‌తో పాటు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కె.ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, డీకే అరుణ‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి, జితేంద‌ర్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ త‌దిత‌ర చిన్నాపెద్ద నాయ‌కులున్నారు. కానీ సినీ, పొలిటిక‌ల్ గ్లామ‌ర్ వున్న విజ‌య‌శాంతికి చోటు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

విజ‌య‌శాంతిని ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణాలేంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే బీజేపీ అధిష్టానం ప్ర‌తిపాద‌న‌ను విజ‌య‌శాంతి తోసిపుచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. విజ‌య‌శాంతిని ఉద్దేశ పూర్వ‌కంగానే కిష‌న్‌రెడ్డి సూచ‌న మేర‌కు ప‌క్క‌న పెట్టారా? అనే అనుమానం లేక‌పోలేదు. ఏది ఏమైనా విజ‌య‌శాంతికి బీజేపీలో నూక‌లు చెల్లాయ‌నేందుకు స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డ‌మే సంకేత‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.