అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థి మీద పైచేయి సాధించడానికి రకరకాల మాయోపాయాలు అనుసరిస్తూ ఉంటుంది. ఆ పార్టీకి చెందిన నాయకులను వివిధ రూపాలలో మభ్యపెట్టి, ప్రలోభపెట్టి లేదా బెదిరించి వారిని తమ పార్టీలో కలిపేసుకోవడం అనేది చాలా సహజంగా జరిగే మార్గాలలో ఒకటి.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ప్రయత్నంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అంటూ.. గులాబీ పార్టీ నాయకులు పదేపదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్న సమయంలో.. కాంగ్రెస్ ప్రముఖుల మాటలు ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి. వారి మాటలు అచ్చంగా కార్యరూపం దాలిస్తే గులాబీ పార్టీ ఖాళీ కాక మానదని పలువురు అంచనా వేస్తున్నారు.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తమలో కలిపేసుకుంది భారాస. ఆ వైనం కాంగ్రెస్ పార్టీ ఒక పట్టాన మరచి పోతుందని అనుకుంటే పొరపాటు.
ఇప్పుడు కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. అందుకు ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందని కూడా అనుకోలేము. అయితే తమంతగా ఫిరాయింపులను ప్రోత్సహించమని, తమ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. తదనంతర పరిణామాలలో అనేకమంది సీనియర్ నాయకులు పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాస నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని చాలా నమ్మకంగా ప్రకటిస్తున్నారు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాస బలం శాసనసభలో 10 కంటే తక్కువ స్థానాలకు పడిపోతుందని జోస్యం చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని అంటున్నారు. భారాసకు ఉన్నదే 39 మంది. అందులో 30 మంది కాంగ్రెస్లో చేరిపోతే గులాబీ బలం సింగిల్ డిజిట్ కు పడిపోతుంది. గులాబీ పువ్వు రేకలన్నీ రాలిపోతే తొడిమ మాత్రమే మిగిలినట్లుగా తయారవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అవుతుందన్నట్లుగా ఉన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు కొంత అతిశయం కావచ్చు. కానీ పూర్తిగా కొట్టి పారేయడానికి వీల్లేదు. 30 మంది కాకపోయినా పెద్ద సంఖ్యలోనే ఫిరాయింపులు ఉంటాయని అనుకోవచ్చు. రాజకీయం అంటేనే అవకాశవాదంగా మారిపోయిన ఇవాల్టి రోజుల్లో వచ్చే ఐదేళ్లపాటు తమ తమ రాజకీయ వ్యాపార జీవితాలను పరిరక్షించుకోవడానికి.. గులాబీ దళం నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే అనైతిక ఫిరాయింపులకు పాల్పడినారో.. అదే మాదిరిగా కాంగ్రెస్ కూడా రెచ్చిపోతుందని అంతా అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఇదే మాదిరిగా తమ బలాన్ని నిరూపించుకుంటే గనుక గులాబీ ఎమ్మెల్యేలను ఫిరాయింప చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.