పోలీసుల ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన పోలీస్ బాస్

గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో ఓ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పోలీసులకు చెందిన వీడియో అది. Advertisement హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఎస్ఐలు భావన,…

గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో ఓ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పోలీసులకు చెందిన వీడియో అది.

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఎస్ఐలు భావన, కిషోర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీళ్లు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేశారు. దీని కోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిసరాల్ని వాడుకున్నారు. పోలీసు జీపులు కూడా వాడుకున్నారు. పైగా ఇద్దరూ కొద్దిసేపు యూనిఫామ్ లో కనిపించారు.

కొంతమంది సన్నిహితులకు ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోను వీళ్లు షేర్ చేశారు. అలా అది కొంతమంది మీడియా వాళ్ల చేతిలో పడింది. తమ సొంత పనుల కోసం పోలీసు జీపులు, ఖాకీ యూనిఫాం, పోలీస్ ప్రాంగణం వాడుకోవడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఓ మధురక్షణం కోసం వాళ్లు అలా చేయడంలో తప్పు లేదని సమర్థించారు.

ఈ మొత్తం వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. వీడియోలో పోలీసులు చేసిన చర్యను ఆయన సమర్థించారు. ఇకపై ఎవరైనా అలాంటివి చేయాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకొని చేయొచ్చని కూడా సూచించారు.

“ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు చూశాను. పోలీసింగ్ అనేది చాలా కఠినమైన పని, ముఖ్యంగా మహిళలకు. ఆమె డిపార్ట్‌మెంట్‌లో జీవిత భాగస్వామిని పొందడం గొప్ప విషయం. ఆ ఇద్దరు పోలీసు అధికారులు డిపార్ట్‌మెంట్ ఆస్తి, చిహ్నాలను ఉపయోగించడంలో నాకు తప్పు కనిపించ లేదు. వారు మాకు ముందే తెలియజేసి ఉంటే మేం కచ్చితంగా షూట్‌కి అనుమతి ఇచ్చేవాళ్లం. మనలో కొందరికి ఆగ్రహావేశాలు కలగవచ్చు, కానీ నాకు తప్పు కనిపించలేదు.”

ఇలా పోలీసుల ప్రీవెడ్డింగ్ షూట్ పై సూటిగా స్పందించారు సీపీ. సదరు పోలీసు జంట తనను వివాహానికి ఆహ్వానించనప్పటికీ, వారిని కలిసి ఆశీర్వదించాలని ఉందన్నారు. అయితే ఇకపై ఎవరైనా ఇలాంటి పనులు చేయాలనుకుంటే, ముందస్తుగా అనుమతి తీసుకుంటే మంచిదని సూచించారు సీవీ ఆనంద్.