కాంగ్రెస్‌కు కొరుకుడపడని సీపీఎం!

తెగేదాకా లాగుతూ ఉంటే.. కాస్త తగ్గి వస్తారనే కాంగ్రెస్ ఆలోచన సీపీఎం విషయంలో అంత సఫలం అయినట్టుగా కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని సీట్ల సంగతి తేల్చకుండా నానుస్తూ వచ్చిన వ్యవహారం.. సీపీఐ…

తెగేదాకా లాగుతూ ఉంటే.. కాస్త తగ్గి వస్తారనే కాంగ్రెస్ ఆలోచన సీపీఎం విషయంలో అంత సఫలం అయినట్టుగా కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని సీట్ల సంగతి తేల్చకుండా నానుస్తూ వచ్చిన వ్యవహారం.. సీపీఐ విషయంలో వర్కవుట్ అయింది. ఒక్క సీటుతో సర్దుకుని.. తర్వాత ఎమ్మెల్సీ ఆఫర్ వస్తే లాభపడేందుకు ఆ పార్టీ ఒప్పుకుంది. 

ఇదే గేమ్ ప్లాన్ సీపీఎంతో కూడా చేయాలనుకుంటే వర్కవుట్ కాలేదు. సీపీఎం కాంగ్రెసుతో సంబంధం లేకుండా పోటీచేయడానికి నిర్ణయించుకుని.. 14 మంది అభ్యర్థులతో జాబితాను కూడా ప్రకటించేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కు వారిని బుజ్జగించే పని పడింది.

కీలకమైన 14 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను తమ్మినేని వీరభద్రం ప్రకటించేశారు. దీంతో ఖంగుతిన్న కాంగ్రెస్ ఇప్పుడు వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉంది. జాబితా ప్రకటించిన తర్వాత, మల్లు భట్టి విక్రమార్క, తమ్మినేనికి ఫోను చేసి.. జాబితా ప్రకటించకుండా ఆపాలని రిక్వెస్టు చేయడం.. ఆల్రెడీ ప్రకటన కూడాపూర్తయిపోయిందని ఆయన ముక్తసరిగా చెప్పేయడం కూడా జరిగిపోయింది. కానీ సీపీఎం  మీద ఢిల్లీ లెవెల్లోనైనా ఒత్తిడితెచ్చి రాష్ట్ర కమిటీ నిర్ణయాలను మార్చగలిగే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ అధిష్ఠానానం  మీద భారం వేసి ఎదురుచూస్తోంది.

రెండు సీట్లు, అవి కూడా తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే.. పొత్తు సంగతి మర్చిపోవాలనే సంకేతాలను సీపీఎం చాలా స్పష్టంగానే కాంగ్రెసు పార్టీకి పంపింది. అడిగినట్లుగా రెండు సీట్లు ఇచ్చి ఉంటే బహుశా తమ్మినేని బరిలోకి దిగేవారు కారేమో. ఇప్పుడు తమ్మినేని స్వయంగా పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ తానే నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో కాంగ్రెసు పార్టీకి కీలక నాయకుడిగా భావిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నో ఆశలతో ఇక్కడినుంచి బరిలో ఉన్నారు. తనకు పడగల ఏ ఒక్క ఓటు కూడా చీలకుండా ఉండేందుకు ఆయన కష్టమ్మీద తుమ్మల నాగేశ్వరరావును ఒప్పించి.. ఖమ్మంకు పంపారు. అలాగే షర్మిల కూడా పోటీచేయకుండా మంత్రాంగం నడిపి, ఆమె పార్టీ పూర్తిగా ఎన్నికలనుంచి తప్పుకుని మద్దతివ్వడానికి అనుకూలంగా తెరవెనుక చక్రం తిప్పడంలో భాగంగా నిలిచారు.

ఇన్ని చేసినా సరే.. సీపీఎం  మాత్రం వారికి కొరుకుడుపడడం లేదని, వారితో పొత్తు కుదరాలంటే కేవలం బుజ్జగింపులు సరిపోకపోవచ్చునని, వారి డిమాండ్లను కూడా గౌరవించక తప్పకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.