వరలక్ష్మి టిఫిన్స్.. ఇడ్లీ, దోశ, డ్రగ్స్

సాధారణంగా టిఫిన్ సెంటర్ కు వెళ్తే, ఏమున్నాయని అడగడం కామన్. అట్నుంచి సమాధానం కూడా అంతే కామన్ గా వస్తుంది. ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఊతప్పం.. ఇలా పెద్ద లిస్ట్ చదువుతాడు సర్వర్.…

సాధారణంగా టిఫిన్ సెంటర్ కు వెళ్తే, ఏమున్నాయని అడగడం కామన్. అట్నుంచి సమాధానం కూడా అంతే కామన్ గా వస్తుంది. ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఊతప్పం.. ఇలా పెద్ద లిస్ట్ చదువుతాడు సర్వర్. అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో మాత్రం మెనూ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, పూరితో పాటు డ్రగ్స్ అని కూడా చెబుతాడు అక్కడ సర్వర్.

అవును.. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫేమస్ టిఫిన్ సెంటర్ గా పేరుతెచ్చుకున్న వరలక్ష్మి టిఫిన్స్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో టిఫిన్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులు, డ్రగ్స్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టిఫిన్ సెంటర్ యజమానితో పాటు, మరో మహిళను అరెస్ట్ చేశారు.

ఎలా జరిగింది.. నానక్ రామ్ గూడకు చెందిన 34 ఏళ్ల అనూరాధకు, ప్రగతి నగర్ కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ఈమె డ్రగ్స్ తీసుకోవడం నేర్చుకుంది. ఆ తర్వాత డ్రగ్స్ డీలర్ గా కూడా మారింది. గోవా వెళ్లి మాదక ద్రవ్యాల్ని అక్రమంగా హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మేది. ఈ క్రమంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.

ప్రభాకర్ రెడ్డికి కూడా డ్రగ్స్ అలవాటు చేసింది అనురాధ. అక్కడితో ఆగకుండా డ్రగ్స్ బిజినెస్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని ఆశజూపింది. దీంతో ప్రభాకర్ రెడ్డి కూడా ఈ ఫీల్డ్ లోకి దిగాడు. జూబ్లిహిల్స్ కు చెందిన వెంకటసాయి, ప్రభాకర్ రెడ్డికి దగ్గరయ్యాడు. హోటల్ బిజినెస్ చేయడానికి గైడెన్స్ అడిగాడు. ఈ క్రమంలో అతడు కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు.

వెంకటసాయి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వరలక్ష్మి టిఫిన్స్ కేంద్రంగా దందా జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్ల నుంచి దాదాపు 20 లక్షలు విలువచేసే మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు.

తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమస్.. గచ్చిబౌలి వెళ్లి వరలక్ష్మి టిఫిన్స్ అంటే ఎవరైనా చెబుతారు. అది అంత ఫేమస్. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అక్కడే టిఫిన్స్ చేస్తుంటారు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు, నైట్ షిఫ్ట్ పూర్తిచేసుకొని ఇంటికెళ్లే ఉద్యోగులకు కేరాఫ్ అడ్రస్ అది. ఉదయం 4 గంటల నుంచే ఆ టిఫిన్ సెంటర్ లో హడావుడి ఉంటుంది. రకరకాల వెరైటీల్ని ప్రవేశపెట్టి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది ఆ టిఫిన్ సెంటర్.

అలా సక్సెస్ ఫుల్ గా ఫుడ్ బిజినెస్ తో పాపులర్ అయిన ప్రభాకర్ రెడ్డి, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు, ఈజీ మనీకి ఆశపడ్డాడు. ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం వరలక్ష్మి టిఫిన్స్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.