కేసీఆర్ ను ఓడించడానికి పోటా పోటీ

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను (వ్యక్తిగతంగా) ఓడించడానికి  బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇప్పటి నుంచే కేసీఆర్ ను ఓడించేది తామేనంటూ రెండు పార్టీలు జబ్బలు చరుస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి,…

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను (వ్యక్తిగతంగా) ఓడించడానికి  బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇప్పటి నుంచే కేసీఆర్ ను ఓడించేది తామేనంటూ రెండు పార్టీలు జబ్బలు చరుస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పగతో రగిలిపోతున్నట్లు కనబడుతోంది. తాను గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ను మట్టి కరిపిస్తానని ఈటల ప్రతిజ్ఞ చేశాడు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూరాబాద్ నుంచి కాకుండా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్నాడు. ఆయన అప్పుడే తన నియోజకవర్గాన్ని నిర్ణయించుకున్నాడు. 

ఈటల ప్రకటనతో ముందస్తు ఎన్నికల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం కాక రేపుతోంది. గజ్వేల్ లో పోటీ చేయడమే కాదు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సువేందు అధికారి ఓడించినట్లుగానే తాను కేసీఆర్ ను ఓడించి తీరుతానని చెప్పాడు. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో ఫోకస్ అంతా అటువైపే మళ్లింది.

తెలంగాణలో బెంగాల్ తరహాలో బీజేపీ పోరాడబోతుందనే సంకేతం వచ్చింది. అదే సమయంలో కేసీఆర్ ను నేరుగా ఢీకొట్టాలన్న నిర్ణయంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి ప్రత్యర్థి బీజేపీయేనా అన్న చర్చ మొదలైంది. ఇంతలోనే గజ్వేల్ సీన్ లోకి వచ్చాడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేసులో తాము వెనకబడలేమనే సంకేతం వచ్చేలా  రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 

గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ అభ్యర్థే ఓడిస్తాడని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పాడు కాని ఏ పార్టీ నుంచో చెప్పలేదంటూ బాంబ్ పేల్చాడు. అంటే ఈటల బీజేపీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తాడని అర్థమా ? 

రాజేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గజ్వేల్ లో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ కాకుంటే ఈటల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. హుజురాబాద్ లో సంచలన విజయం సాధించి కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఈటల రాజేందర్ కు బీజేపీలో సరైన గుర్తింపు దక్కడం లేదనే టాక్ ఎప్పటి నుంచో ఉంది.  

ఈటల అసంతృప్తిగా ఉన్నారని తెలిసే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అమిత్ షా ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారని తెలుస్తోంది. ఆ తర్వాతే చేరికల కమిటీ  కన్వీనర్ గా ఈటలను నియమించారు. అయితే చేరికల కమిటీ  కన్వీనర్ పదవిపై ఈటల సంతృప్తిగా లేడని తెలుస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సాయం చేశాడని, కావాలనే కాంగ్రెస్ తరపున డమ్మీ అభ్యర్థిని పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలే  అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హుజురాబాద్ లో బీజేపీ నుంచి గెలిచినా.. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజేందర్ కాంగ్రెస్ గూటికి చేరతాడనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

రేవంత్ రెడ్డి ఎందుకలా మాట్లాడాడు? ఈటల రాజేందర్ రూట్ మారుస్తున్నాడా? అన్న అంశాలపై బీజేపీ పెద్దలు చర్చించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే సంచలనం కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడాడని అంటున్నారు. 

ఈటల రాజేందర్ కు బీజేపీ పెద్దల ఆశిస్సులు ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఆయన కీలక పదవి రాబోతుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే…కేసీఆర్ దుర్మార్గమైన పాలనను అంతమొందించే బాధ్యత తనపై ఉందని ఈటల రాజేందర్ అన్నాడు. కేసీఆర్ ను ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందన్నాడు. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే.. పార్టీ నుంచి బయటకు పంపారన్నాడు. 

కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసన్నాడు. సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనంటూ కామెంట్ చేశాడు. తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ ఢిల్లీ పెద్దలకు చెప్పానని అన్నాడు. నిజంగా ఈటల గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ను ఓడగొడితే ఆయన్ని మించిన హీరో ఉండడు. ఈలోగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేం.