‘పోయినోళ్లు అందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు..’ అంటూ ఆచార్య ఆత్రేయ.. గుండె చెమ్మగిల్లజేసే పాట రాశారు.. మూగమనసులు చిత్రంలో. కానీ.. ఆధునికతరం రాజకీయాల్లో పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు.
ఇక్కడ పార్టీలను వీడి- పోయినళ్లు అందరూ చెడ్డోళ్లు.. ఉన్నోళ్లు మాత్రమే అత్యంత నిజాయితీ పరులు, సత్యసంధులు! పోయినోళ్లు కూడా పోకుండా తమ సొంత పార్టీలో ఉన్నంత వరకు మహానుభావులే. మళ్లీ వెనక్కు తిరిగి తమ పార్టీలోకి వస్తే మళ్లీ మహానుభావులే. పోయినప్పుడు మాత్రమే వాళ్లు చెడ్డోళ్లుగా కనిపిస్తుంటారు! ఇది తాజా రాజకీయ మంచి-చెడుల సిద్ధాంతం. తెలంగాణ భారాస నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలను గమనిస్తోంటే మనకు అదే అనిపిస్తుంది.
తాజాగా హన్మకొండ వద్ద విలేకరులతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. భారాసను వదలి నాయకులు క్యూ కట్టి మరీ ఇతర పార్టీల్లోకి వలసవెళ్లుతున్న తీరు మీద ఒక రేంజిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. భారాస ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సిటింగ్ ఎంపీలే చాలా మంది బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు కూడా జారుకోవడం ఇప్పుడే మొదలైంది. పార్టీ కీలక నాయకులు కూడా తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్, భాజపా పార్టీలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎర్రబెల్లి విమర్శలు గమనించదగినవి.
వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని ఆయన అంటున్నారు. వైఎస్సార్ పరిపాలన కాలంలో ఎంతో ఒత్తిడి వచ్చినా తాను పార్టీ మారలేదని, తెలంగాణ కోసం మాత్రమే తెదేపాను వీడి కేసీఆర్ చెంత చేరానని చెప్పుకున్నారు. అయితే భారాసను వీడుతున్న వారి మీద ఆయన అక్కసు కేవలం ఇటీవలి చేరికలు దానం, రంజిత్ రెడ్డి వంటి వారి గురించి కాకపోవచ్చునని పలువురి అంచనా.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పార్టీ వీడకుండా చేయడానికి ఎర్రబెల్లి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయినా వర్కవుట్ కాలేదు. రమేష్.. పార్టీని వీడే ప్రకటన కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాక.. హడావుడిగా ఆయన ఇంటికి వెళ్లి దాదాపుగా ఆయనను కిడ్నాప్ చేసినంత పనిచేసి కేసీఆర్ సమక్షానికి తీసుకువెళ్లారు.
కేసీఆర్ బుజ్జగించినా, పిచ్చినిర్ణయాలు తీసుకోవద్దు అని హెచ్చరించినా పని జరగలేదు. ఎర్రబెల్లి కష్టం వృథా పోయింది. ఒక్కరోజు తర్వాత.. ఆరూరి తన రాజీనామాను ప్రకటించేసి, బిజెపిలో చేరారు. బహుశా ఎర్రబెల్లి ఈగో హర్ట్ అయిందేమో.. దందాలు చేసేవాళ్లే పార్టీని వీడుతున్నారని అంటున్నారు.
మరి ఆరూరి రమేష్ భారాసలో కొనసాగి ఉంటే.. ఆయనను వరంగల్ ఎంపీగా పోటీచేయించడానికి కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు కదా. ఆయన పార్టీలో ఉంటే.. దందాలు చేసే నాయకుడు కాకుండా పోతారా? ఇలాంటి అవకాశవాద విమర్శలను ప్రజలు చులకనగా తీసుకోరా? అనేది ఎర్రబెల్లి ఆలోచించుకోవాలి. పోయినోళ్ల మీద రాళ్లు వేసే ముందు.. తనతో ఉన్నోళ్లలో ఇంకా ఎంతమంది వెళ్లిపోబోతున్నారో చెక్ చేసుకోవాలి.