చాలా మంది బీజేపీ నాయకులతో పోల్చుకుంటే మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆ పార్టీలో చాలా జూనియర్ లీడర్. ఒరిజినల్ బీజేపీ లీడర్ కూడా కాదు. గతంలో గులాబీ పార్టీ నాయకుడు. కేసీఆర్ సర్కారులో రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు. రుజువుకాని కొన్ని ఆరోపణలు చేసి ఈటలను పార్టీ నుంచి బయటకు పంపాడు కేసీఆర్. వెంటనే బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచాడు.
కాని ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ అండ్ గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడే బీజేపీలో ఉంటాడా? వెళ్లిపోతాడా? అనే అనుమానాలు కలిగాయి. కాని పార్టీలోనే ఉన్నాడు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం ఈటలకు మల్కాజ్గిరి టిక్కెట్ ఇచ్చింది. కాని ఎవరూ ఊహించని విధంగా బంపర్ మెజారిటీతో గెలిచాడు. వాస్తవానికి ఇదే నియోజవర్గం నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు అది బీజేపీ చేతికి వెళ్లింది.
ఈ గెలుపుతో బీజేపీలో ఈటల తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే. కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కారు ఏర్పడింది కాబట్టి ఈటలకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కాని అవి కిషష్‌రెడ్డికి, బండి సంజయ్‌కు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈటల కన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై పడినట్లు కనబడుతోంది. ఆయన చేసిన కామెంట్లు ఆ ఉద్దేశాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. దమ్మన్నోడే బీజేపీ అధ్యక్షుడు కావాలని అన్నాడు.
పైటర్ కావాలన్నాడు. గల్లీల్లో కొట్లాడే వాళ్లు కాదన్నాడు. రాజాసింగ్ లాంటి బచ్చాలు కాదన్నాడు. పనిలో పనిగా తన గురించి కూడా చెప్పుకున్నాడు. తాను ఐదుగురు సీఎంలతో ఫైట్ చేశానని చెప్పాడు. హామీలు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డితో కొట్లాడుతానన్నాడు. కుంభస్థలాన్ని కొట్టేవాడు కావాలన్నాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని కోరుతున్నట్లుగా ఉంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డిని ఢీకొనే సత్తా తనకు ఉందని ఆయన నమ్ముతున్నాడు. ఈ మధ్య బండి సంజయో, కిషన్ రెడ్డో ఎవరో అన్నారు ఈటల అధ్యక్షుడైతే అభ్యంతరం లేదని. ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష పదవికి చాలా డిమాండ్ ఉంది. ఈ పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు. ఎంపీల్లోనే ధర్మపురి అరవింద్, రఘునందనరావు, డీకే అరుణ పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల్లో కూడా కొందరున్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యాడు కాబట్టి కొత్త అధ్యక్షుడి నియామకం తప్పదు.
అందులోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ నాయకత్వం గట్టి నమ్మకంతో ఉంది కాబట్టి ఆ పార్టీ అధ్యక్ష పదవికి ఇంత పోటీ ఏర్పడింది. మామూలుగా అయితే కమలం పార్టీ అధ్యక్ష పదవిని ఎవరూ పట్టించుకోరు.