నా కూతురే నా అపోజిష‌న్‌!

సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ఆయ‌నే సాటి. ఇటు సొంత పార్టీ నేత‌లైనా, అటు ప్ర‌త్య‌ర్థులైనా ఆయ‌న‌కు న‌చ్చ‌లేదంటే, ఏదీ మ‌న‌సులో దాచుకోరు. మ‌న‌సులో ఉండేది క‌క్కేంత వ‌ర‌కూ ఆయ‌న ఊరుకోరు.…

సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ఆయ‌నే సాటి. ఇటు సొంత పార్టీ నేత‌లైనా, అటు ప్ర‌త్య‌ర్థులైనా ఆయ‌న‌కు న‌చ్చ‌లేదంటే, ఏదీ మ‌న‌సులో దాచుకోరు. మ‌న‌సులో ఉండేది క‌క్కేంత వ‌ర‌కూ ఆయ‌న ఊరుకోరు. సీఎం కావాల‌నేది ఆయ‌న చిర‌కాల కోరిక‌. ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సిన అంశ‌మేదీ లేదు.

ప‌దేళ్ల‌కైనా సీఎం అవుతాన‌ని, మీ క‌డుపులో పెట్టుకుని కాపాడుకోవాల‌ని విజ‌య ద‌శ‌మి నాడు త‌న అంత‌రంగాన్ని ఆయ‌న బ‌య‌ట పెట్టారు. దీంతో కాంగ్రెస్‌లో సీఎం అభ్య‌ర్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంద‌ని బీఆర్ఎస్ నేత‌లు సెటైర్స్ విసిరారు. ఇదిలా వుండ‌గా ఇవాళ జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 70 సీట్ల‌తో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పారు.

అయితే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డే సీఎం అని చెప్ప‌డానికి మాత్రం ఆయ‌న‌కు మ‌న‌సు రాలేదు. ఎందుకంటే సీఎం రేస్‌లో ఆయ‌న కూడా ఉన్నారు కాబ‌ట్టి. సీఎం ఎవ‌రో సోనియా, రాహుల్, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే తేలుస్తార‌ని అన్నారు. తెలంగాణ‌కు చేసింది చెప్పుకోడానికి బీఆర్ఎస్ వ‌ద్ద ఏమీ లేక‌పోవ‌డం వ‌ల్లే మ‌రోసారి తెలంగాణ వాదాన్ని తెర‌పైకి తెచ్చింద‌ని విమ‌ర్శించారు. ప‌నిలో ప‌నిగా త‌న ప‌నితీరుపై కూడా నోరు విప్పారు.

‘నా కూతురే నా అపోజిషన్. ప్రభుత్వం వస్తే చెప్పినవన్నీ చేయాలని నా బిడ్డ చెప్పింది. నేను పని చేయకపోతే నా బిడ్డే అడ్డం పడుతది’ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. జ‌గ్గారెడ్డి కుమార్తె జ‌యారెడ్డికి రాజ‌కీయ ఆస‌క్తి ఎక్కువే. తండ్రి త‌ర‌పున ఆమె విస్తృత ప్ర‌చారం చేసే సంగ‌తి తెలిసిందే. ఒక ద‌శ‌లో జ‌గ్గారెడ్డి త‌న కుమార్తెకు టికెట్ ఇవ్వాల‌ని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది. ఇప్పుడు ఆయ‌నే సంగారెడ్డి బ‌రిలో వున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌జ‌ల‌కు ప‌నులు చేయ‌క‌పోతే కుమార్తె జ‌యారెడ్డే నిల‌దీస్తార‌నే జ‌గ్గారెడ్డి కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.