జనసేన డొల్లతనం బయటపడుతోంది ఇలా..?

తన గురించి తాను అతిగా ఊహించుకోవడంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను మించిన వారు ఇవాళ్టి రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు గాక లేరు. ఆయన ప్రతిసారీ ఈ విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు.…

తన గురించి తాను అతిగా ఊహించుకోవడంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను మించిన వారు ఇవాళ్టి రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు గాక లేరు. ఆయన ప్రతిసారీ ఈ విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు. ఆయన తన గురించి చెప్పుకునే మాటలన్నీ అతిశయాలేనని అతి త్వరలోనే నిరూపణ అయిపోతూ ఉంటుంది కూడా. 

ఏపీ రాజకీయాల సంగతి పక్కన పెట్టండి. అక్కడ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆ విషయం మరోమారు నిరూపణ అవుతోంది.

తెలంగాణలో తమకు బలం ఉన్న 35 స్థానాల్లో పోటీచేస్తాం అని జనసేన తొలుత ప్రకటించింది. సీట్ల లిస్టు ప్రకటించారు తప్ప.. అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. సీట్ల లిస్టు ప్రకటిస్తే.. తమను వెతుక్కుంటూ ఆశావహులు వస్తారని వారు ఆశించారు. అయితే ఈలోగా బిజెపి పొత్తు బాబూ ప్లీజ్ అంటూ వారిని వెతుక్కుంటూ వచ్చింది. చివరికి డీల్ కుదిరింది. పదో పదకొండో సీట్లు తేలనున్నాయి. కాపోతే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా వారికి గణనీయంగా సీట్లు దక్కనున్నాయి.

ఇక్కడ ఒక తమాషా గమనించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు బలం లేదని బిజెపి తొలి నుంచి మొత్తుకుంటోంది. ఆ విషయం పొంగులేటితో బేరాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఈటల చాలా స్పష్టంగా ప్రకటించారు. అందుచేత ఆ ప్రాంతాన్ని బిజెపి వదిలించుకుంటోంది. తమ నెత్తిన ఖమ్మం భారం లేకుండా చూసుకుంటోంది. పవన్ కల్యాణ్ కు ఆ విషయం తెలియకుండా.. మురిసిపోయి తీసుకుంటున్నారు.

మొత్తానికి ఆయనకు సీట్లు దక్కుతున్నాయి ఓకే.. కానీ అక్కడ పవన్ కల్యాణ్ కు కేండిడేట్లు ఉన్నారా? అనేది ప్రశ్న. పవన్ కల్యాణ్ తీరు చూస్తే.. సీట్లు దక్కిన తర్రవాత.. అక్కడ మనుషుల్ని వెతుక్కుంటున్నట్టుగా ఉంది. టీవీ నటుడిగా పాపులర్ అయిన, సినిమా నటుడిగా ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకున్న సాగర్ ఇప్పుడు వచ్చి జనసేన పార్టీలో చేరారు. 

ఇన్నాళ్లుగా ఆయనకు పవన్ కల్యాణ్ తెలియదా? పార్టీలో చేరే ఉద్దేశం రాలేదా? ఇప్పుడు ప్రకటించిన సీట్లలో ఏదో ఒకటి తన మొహాన విదిలిస్తారనే ఆశతో వచ్చి చేరాడా.. అనేవి జనం సందేహాలు.

అలాగే హైదరాబాదులోని రియల్ వ్యాపారి ప్రేమకుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన లక్కినేని సురేందర్ రావు, ముయ్యబోయిన ఉమాదేవి, నాగబాబు లాంటివాళ్లు ఇప్పుడొచ్చి పార్టీలో చేరారు. వీళ్లు ఎవ్వరికీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే వేరే సంగతి. కానీ వీరిలో ఏ ఒక్కరికి టికెట్ దక్కినా కూడా.. ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో జనసేనకు ఠికానా లేదని అర్థమవుతోంది. పైకి ఏం చెప్పుకున్నా ఆ పార్టీలో డొల్లతనం ఇలా బయటపడుతోంది.