జనసేనాని పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పంచ్‌లు విసిరారు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్‌కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కనీసం 10 మంది జనసేన తరపున అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన నిర్దేశించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అవతరణను పవన్‌కల్యాణ్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటని ప్రశ్నించారు. పవన్ సిద్ధాంతం, ఆయన ఆలోచన విధానాలేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదని వ్యంగ్యంగా అన్నారు. పవన్ భావసారూప్యం గురించి తమకు తెలియదని జీవన్‌రెడ్డి వెటకరించారు. తెలంగాణలో అధికార పార్టీ నేతలతో పవన్‌కు సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు.
తెలంగాణలో అభివృద్ధి బాగా జరిగిందని కూడా ఆయన కితాబిచ్చారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలతో పవన్‌కు సరైన సంబంధాలు లేవు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి పవన్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ వరకూ ఆయన పొత్తు. అది కూడా పేరుకు మాత్రమే. పొత్తు ధర్మాన్ని పవన్ పాటించడం లేదు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామంటూనే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని, మరికొందరితో పొత్తులుంటాయని చెప్పి, అన్ని రాజకీయ పక్షాల్ని గందరగోళంలోకి పవన్ నెట్టారు.
అందుకే పవన్ రాజకీయ వైఖరిపై అన్ని రాజకీయ పక్షాల్లో వ్యతిరేక భావన వుంది. ముఖ్యంగా పవన్ వైఖరిపై బీజేపీ గుర్రుగా వుంది. నిలకడ లేని రాజకీయాలు చేస్తూ, ఎప్పుడెలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియడం లేదనే ఆరోపణ బీజేపీ నుంచి వస్తోంది. ఇదే భావనను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యక్తం చేయడం గమనార్హం. చివరికి పవన్‌ను ఓ కమెడియన్‌గా చూసే పరిస్థితి వస్తుందేమో!