తమరు అలా చేయొచ్చు కదా కవితక్కా!

రాజకీయల్లో నాయకులు ఒక్కొక్కరు ఒక్కక్క అంశాన్ని తమ సొంతం చేసుకుంటారు. ఆ అంశంపై మాట్లాడాలన్నా, పోరాడాలన్నా పేటెంట్ తమకు మాత్రమే ఉంటుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ అంశానికి సంబంధించి చిన్న డెవలప్మెంట్ ఉన్నా…

రాజకీయల్లో నాయకులు ఒక్కొక్కరు ఒక్కక్క అంశాన్ని తమ సొంతం చేసుకుంటారు. ఆ అంశంపై మాట్లాడాలన్నా, పోరాడాలన్నా పేటెంట్ తమకు మాత్రమే ఉంటుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ అంశానికి సంబంధించి చిన్న డెవలప్మెంట్ ఉన్నా సరే దాని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భారత రాష్ట్ర సమితి నాయకురాలు కవితక్క కూడా అలాంటి ప్రయత్నంలో ఉన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడం ద్వారా యావత్తు దేశంలోని మహిళా జాతిని తానే ఉద్ధరించినట్లుగా, ఆ చట్టాన్ని తానే సాధించి తెచ్చినట్లుగా ప్రజలు గుర్తించాలని ఆమె తహతహలాడుతున్నారు. పాపం కవితక్క మహిళా రిజర్వేషన్ అంశాన్ని చాలా ఆలస్యంగా భుజానికి ఎత్తుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన తండ్రి తొలి క్యాబినెట్లో అసలు ఒక్క మహిళా మంత్రి కూడా లేరనే సంగతి ఆమెకు గుర్తులేదు. ఆమె మహిళా రిజర్వేషన్ పాట ఎత్తుకునే వేళకే కేంద్రం చట్టం కూడా చేసేసింది. మైలేజీ ఆమె ఖాతాలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. 

కవిత అక్కడితో ఊరుకోకుండా ఎలాగైనా ఈ విషయంలో నుంచి తనకు అడ్వాంటేజీ పిండుకోవాలనే ప్రయత్నంలో ఉంది. పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం 2029 ఎన్నికల నాటికి అమలులోకి వస్తుందని భావిస్తుండగా, కాదు కూడదు 2024 సార్వత్రిక ఎన్నికలలోనే దానిని అమలు చేయాలని ఒక అసహజమైన పోరాటానికి కవితక్క ఇప్పుడు తెర తీస్తోంది. 

ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మహిళా ఓటర్లలో తమ పార్టీకి మైలేజీ వస్తుందని ఆమె అనుకుంటూ ఉన్నదేమో తెలియదు. కానీ ఆ చట్టం వచ్చిన తరవాత కూడా తన తండ్రి మహిళలకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పది శాతం టికెట్లు కూడా ఇవ్వలేదని ఆమె మర్చిపోతున్నారు. 

ఇపుడు సత్వర అమలుకోసం సుప్రీంకోర్టుకు వెళతానని అనే బదులుగా.. తమ పార్టీ తరఫున మూడోవంతు సీట్లు ఎంపీ ఎన్నికల్లో మహిళలకు ఇప్పించగలిగితే చాలా గౌరవంగా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.