కేసీఆర్ అంత తికమకకు ఎలా గురయ్యారబ్బా?

కేసీఆర్ అంటేనే మాటల మరాఠీ. మాటలతో మాయ చేయగల, ఎలాంటి వారినైనా బుట్టలో పడేయగల నాయకుడిగా ఆయనకు పుష్కలమైన కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికలను చాలా ఒత్తిడి మధ్య ఎదుర్కొంటున్నారు.…

కేసీఆర్ అంటేనే మాటల మరాఠీ. మాటలతో మాయ చేయగల, ఎలాంటి వారినైనా బుట్టలో పడేయగల నాయకుడిగా ఆయనకు పుష్కలమైన కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికలను చాలా ఒత్తిడి మధ్య ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది, నమ్మవద్దు అని చెప్పడం తప్ప.. వారికి ఓటు వేయొద్దని అనడానికి ఆయనకు పెద్దగా పాయిట్లు లేవు. 

కాంగ్రెస్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వకుండా అన్ని పార్టీలనూ తమ జట్టులోకి కలుపుకుంటోంది. లేదా, తమ జట్టుకు అనుకూలంగా వ్యవహరించేలా ఏర్పాటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గందరగోళానికి గురవుతున్నారో ఏమో గానీ.. కేసీఆర్ సభల్లో పొల్లు మాటలు మాట్లాడుతున్నారు.

ఖమ్మం లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల ద్వారా మాత్రమే దేశానికి మేలు జరుగుతుందని, జాతీయ పార్టీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, ప్రాంతీయ పార్టీలే దేశానికి రక్ష అని రకరకాల సుద్దులు చెప్పారు. ఆయన ఈ మాటలను కొన్ని నెలల ముందుచెప్పి ఉంటే చాలా నమ్మశక్యంగా ఉండేది. 

కానీ.. దశబ్దానికి పైగా నడిపిన తన సొంత ప్రాంతీయ పార్టీని అతి ప్రయాసమీద, ఎన్నెన్నో జాతీయ స్థాయి గంపెడాశలతో జాతీయ పార్టీగా మార్చిన తర్వాత ఆయన ఇలా ‘ప్రాంతీయ’ పాట పాడడం అనేది చిత్రంగా కనిపిస్తోంది. తను ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిని అని, జాతీయ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నానని ఆయన మర్చిపోయినట్లున్నారు. అందుకే కంగారులో ప్రాంతీయ పార్టీల పాట ఎత్తుకున్నారు.

కాంగ్రెస్, బిజెపిలు ఎన్నడూ తెలంగాణ జెండా ఎత్తుకోలేదనే మాట జనాంతికంగా కేసీఆర్ అనేస్తున్నారు గానీ.. ప్రజలు ఆ మాటను నమ్మడం కూడా కష్టం. బిజెపి తొలినుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా, తెలంగాణకు కూడా అనుకూలంగా మాట్లాడుతూనే ఉంది. 

తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసు. కానీ.. ప్రాంతీయ పార్టీలు అనే పాట ఇవాళ పాడడం ద్వారా.. ప్రన్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టున పడతానని కేసీఆర్ అనుకుంటూ ఉండవచ్చు గానీ.. రేపు ఆయన తన భారాస పార్టీ తరఫున ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. ఇవే మాటలు ప్రతికూల ప్రభావం చూపించవా అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అప్పుడు ప్రత్యర్థులు ఆయన ఇప్పటి మాటల్ని అక్కడ వాడుకోకుండా ఉంటారా. 

తెలంగాణ ఎన్నికల్లో నెగ్గారనే కంగారులో జాతీయ పార్టీగా భారాసకు ఆత్మహత్యా సదృశమైన మాటలను కేసీఆర్ వాడుతున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది.