కేసీఆర్ తీరు: ‘మబ్బుల్లో నీళ్లు చూసి..’

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నారనేది సామెత! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార సరళి అంతకంటె భిన్నంగా ఏమాత్రమూ లేదు. ముంత ఒలకబోసుకోవడం కాకపోవచ్చు.. మబ్బుల్లో నీళ్లు చూసి.. నేలలో విత్తనం వేస్తున్నట్టుగా ఆయన…

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నారనేది సామెత! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార సరళి అంతకంటె భిన్నంగా ఏమాత్రమూ లేదు. ముంత ఒలకబోసుకోవడం కాకపోవచ్చు.. మబ్బుల్లో నీళ్లు చూసి.. నేలలో విత్తనం వేస్తున్నట్టుగా ఆయన తీరు కనిపిస్తోంది. 69 వేల కోట్ల రూపాయల అంచనాలతో హైదరాబాదు మెట్రోకు అదనంగా 278 కిలోమీటర్ల మేర మార్గాలను నిర్మించడానికి ఆయన చేసిన ప్రకటన కాస్త ఈ తీరుగా కనిపిస్తోంది.

హైదరాబాదులో మెట్రో రైల్ వ్యవస్థ ప్రజారవాణా విషయంలో చక్కగా సేవలందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందరికీ బాగా ఉపయోగపడుతోంది. ఈ మెట్రో మార్గాన్ని మాదాపూర్ లోని రాయదుర్గం స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు పొడిగించడానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. అలాగే కొత్తగా మరో 278 కిమీల మెట్రో మార్గాలను నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో రెండు మార్గాల్లో డబుల్ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంటుంది. మొత్తం 69వేల కోట్లతో అంచనాలు తయారుచేశారు.

అయితే ఈ వ్యయం భరించడం గురించి కేసీఆర్ చెబుతున్న మాటలే చిత్రంగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం సైతం ఈ వ్యయానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాం అని ఒకవైపు కేసీఆర్ అంటున్నారు. అదే సమయంలో, కేంద్రం సహాయం చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే పూర్తిచేస్తుందని కూడా అంటున్నారు. 

కేంద్రం సహాయం కోరుతున్నప్పుడు.. అందుకు ముందుగా వారికి సమాచారం ఇచ్చారా, అనుమతి తీసుకున్నారా? అనే సంగతులు మాత్రం వెల్లడించలేదు. ఈ వైఖరి చూస్తే కేవలం కేంద్రం మీద బురద చల్లడానికి ఇంకో అస్త్రం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉన్నది తప్ప మరొకటి కాదు. తెలంగాణకు కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదు అనడానికి తప్ప మరోలా ఉపయోగపడకపోవచ్చు.

కేసీఆర్ ఇంకో తమాషా ఏం చెబుతున్నారంటే.. కేంద్రంలో 2024లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందిట. ఆ ప్రభుత్వంలో భారాస కీలకపాత్ర పోషిస్తుందిట. కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా.. కొత్త మెట్రో మార్గాలకు కావాల్సిన 69 వేల కోట్ల నిధులకు సాయం రాబట్టుకుంటారట. ఈ వ్యవహారం మరీ.. మబ్బుల్లో నీళ్లు చూసి.. ఇప్పుడు విత్తు వేసినట్టుగా ఉన్నది. 

ఎందుకంటే.. కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఏర్పడితే ఏంటి పరిస్థితి? పోనీ, కేసీఆర్ కలగంటున్నట్టుగా మోడీ వ్యతిరేకులు గెలిచినా, వారు స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడిక తెలంగాణ ప్రజలు మెట్రో మీద ఆశ వదలుకోవాల్సిందేనా? అనేది సందేహం. కేంద్ర సాయంతో నిమిత్తం లేకుండా ఈ కొత్త ప్రతిపాదనల్ని పూర్తిచేస్తాం అని చెప్పగలిగినప్పుడే.. దీనిని ప్రజలు నమ్మగలరని పలువురు అంటున్నారు.