తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లనున్నారు. చండూరు మండలం బంగారుగడ్డలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారి ప్రజల ముందుకు రావడంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరికి ఆసక్తి నెలకొంది. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ వైపు మళ్లించే దిశగా కేసీఆర్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొనుగోలు వ్యవహారంలో కీలక సమాచారం కూడా బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సంవత్సరంలో జరగబోతున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు మునుగోడు ఉపఎన్నిక కీలకంగా మారడంతో అన్ని పార్టీలు సర్వ శక్తులు వడ్డుతున్నారు. మునుగోడులో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోతుందనే నమ్మకంతో అన్ని పార్టీలు ఉన్నాయి. ఒక ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.