ష‌ర్మిల‌ను రెచ్చ‌గొట్ట‌డం వెనుక కేసీఆర్ వ్యూహం!

వ్యూహాలు ర‌చించ‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట‌. ఎత్తుకు పైఎత్తులేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను కేసీఆర్ బోల్తా కొట్టిస్తుంటారు. తాజాగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ను పెద్ద నాయ‌కురాలిగా చేయ‌డం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా? అనే అనుమానాలు…

వ్యూహాలు ర‌చించ‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట‌. ఎత్తుకు పైఎత్తులేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను కేసీఆర్ బోల్తా కొట్టిస్తుంటారు. తాజాగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ను పెద్ద నాయ‌కురాలిగా చేయ‌డం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ష‌ర్మిల తాజాగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు. రాజ‌కీయంగా ఇది సీరియ‌స్ నిర్ణ‌య‌మే. తెలంగాణ‌లో ష‌ర్మిల జీరో నుంచి స్టార్ట్ అయ్యారు.

గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయంగా ఆమె గ్రాఫ్ పెరుగుతోంది. ఏమీ లేని చోట ప‌ట్టు సాధించేందుకు ష‌ర్మిల చేస్తున్న పోరాటం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. 3,500 కి.మీ పాద‌యాత్ర‌లో ష‌ర్మిల‌కు ఎక్క‌డా ఇబ్బందులు ఎదురు కాలేదు. ప్ర‌తి చోట స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వెళ్లారు. అయినా ఏ ఒక్క‌రూ ఆమె ఉనికిని గుర్తించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.

కానీ వ‌రంగ‌ల్‌లోనే ఎందుకు అడ్డుకున్నారు. ప్ర‌స్తుతం నిరాహార దీక్ష చేసే వ‌ర‌కూ ష‌ర్మిల వెళ్లేలా కేసీఆర్ స‌ర్కార్ ఎందుకు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు ష‌ర్మిల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో దూసుకొస్తున్న బీజేపీని రాజ‌కీయంగా అడ్డుకునే క్ర‌మంలో ష‌ర్మిల‌ను టీఆర్ఎస్ వాడుకుంటోందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ష‌ర్మిల చుట్టూ రాజ‌కీయాలు న‌డ‌ప‌డం ద్వారా … ఇత‌ర‌త్రా అంశాలేవీ చ‌ర్చ‌నీయాంశం కాకుండా చేయాల‌నే ఎత్తుగ‌డ‌లో భాగంగా టీఆర్ఎస్ స‌ర్కార్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తోందా? అని కాంగ్రెస్‌, బీజేపీ సందేహిస్తున్నాయి.

ష‌ర్మిల వెనుక ఎవ‌రున్నార‌నే విష‌య‌మై ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ‌కు అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో ష‌ర్మిల కేంద్రంగా రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ష‌ర్మిల ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష ఎపిసోడ్‌ను ఎవ‌రెలా మ‌లుచుకుంటార‌నేది మ‌రో ఒక‌ట్రెండు రోజుల్లో తెలిసే అవ‌కాశం వుంది. ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తే, టీఆర్ఎస్‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. అయిన‌ప్ప‌టికీ అధికార పార్టీ అడ్డుకుంటోందంటే… ఆ పార్టీ మ‌రేదో ఆశిస్తోంది. 

ష‌ర్మిల రాజ‌కీయ పంథా ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మైతే అంత మంచిద‌ని టీఆర్ఎస్ భావిస్తున్న‌ట్టుంది. ఆ మేర‌కు ష‌ర్మిల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు న‌టిస్తోంది. ఇదే అవ‌కాశంగా తీసుకున్న ష‌ర్మిల రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు తెగువ ప్ర‌ద‌ర్శిస్తోంది.