లీగల్‌గా ఆచితూచి అడుగులేసిన కేసిఆర్!

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు బి.ఆర్.ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా మారుతుంది అనే సంగతి కొన్ని వారాలుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. కొత్త రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో పెట్టాలని అనుకున్నటువంటి కేసీఆర్.. రెండు…

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు బి.ఆర్.ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా మారుతుంది అనే సంగతి కొన్ని వారాలుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. కొత్త రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో పెట్టాలని అనుకున్నటువంటి కేసీఆర్.. రెండు పార్టీల నిర్వహణ గందరగోళం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితినే జాతీయ పార్టీగా పేరు మార్చాలని నిర్ణయించారు. అది మొదలుగా సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, లీగల్ గా చిక్కులు ఏర్పడకుండా ఉండేందుకు ఆచితూచి వ్యవహరిస్తూ కేసీఆర్ అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.

బిఆర్ఎస్ పార్టీ జెండా అనేది ఈ కోణంలోంచి గమనించాల్సిన మొట్టమొదటి విషయం. టిఆర్ఎస్ పార్టీ ప్రకటనతో పాటుగాని కొత్త జెండాను కూడా ప్రకటిస్తారని అందులో గులాబీ రంగు మాత్రం తప్పకుండా ఉంటుందని.. ఎన్నికల గుర్తు ఎప్పటికీ కారు మాత్రమే ఉండేలా జాగ్రత్త తీసుకుంటారని.. పార్టీ నుంచే లీకులు వచ్చాయి! అయితే న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా ఉండేందుకు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ ఆలోచన కూడా కేసీఆర్ మార్చుకున్నారు. 

పార్టీ పేరు మాత్రమే ప్రస్తుతానికి మార్చారు. పార్టీ జెండా యధాపూర్వంగానే ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ జెండాలో గులాబీ పతాకం మీద తెలంగాణ రాష్ట్ర అవుట్ లైన్ మ్యాప్ చిహ్నంగా ఉంటుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ఉండే పతాకం జాతీయ పార్టీకి పెడితే కామెడీగా అనిపిస్తుంది. ఆ సంగతి గులాబీ దళపతికి తెలియనిది కాదు. కాకపోతే ఇప్పుడే జండా మార్చడానికి ఆయన సుముఖంగా లేరు. కేవలం పేరు మాత్రమే మారుస్తున్నట్లుగా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 

పేరు మార్పును గుర్తించి జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాల్సిందిగా మాత్రమే ప్రస్తుతానికి ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించిన వెంటనే తక్షణం పార్టీ రాజ్యాంగంలో మార్పు చేయడం ద్వారా పార్టీ జెండాను కూడా మార్చేస్తారని వినిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ కొత్త  పేరును గుర్తించడానికి రెండు మూడు రోజుల వ్యవధి పడుతుందని అనుకుంటున్నారు. 

త్వరలోనే ఆ అనుమతులు వచ్చేస్తే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బి.ఆర్.ఎస్ తరఫున నామినేషన్ వేస్తారు. అనుమతులు ఆలస్యం అయితే తెరాస పేరు మీద ఎన్నికలలో దిగే చివరి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారు.

మొత్తానికి భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు వచ్చిన వెంటనే.. పార్టీ పరంగా అనేక గుణాత్మక మార్పులు ఉంటాయని తెలుస్తోంది.