భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ గొప్ప విషయం ప్రకటించారు. త్వరలోనే తమ పార్టీలోకి పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకుల చేరికలు ఉండబోతున్నాయని ఆయన చాలా ఆర్భాటంగా ప్రకటించారు. భారాస, కాంగ్రెసుల్లోని నాయకులు.. ఆ పార్టీలకు ప్రత్యమ్నాయంగా బిజెపిని చూస్తున్నారని ఆయన సెలవిచ్చారు. తమ పార్టీలోకి త్వరలోనే చాలా చాలా వలసలు ఉంటాయని ప్రతి నాయకుడూ చెప్పుకోవచ్చు గానీ.. వాటిని ప్రజలు ఏ ప్రాతిపదిక మీద నమ్మాలి? అనేది సందేహాస్పదమే.
సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన సందర్భంగా కిషన్ రెడ్డి ఈ మాటలు వల్లించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ద్వితీయశ్రేణి నాయకులు వచ్చి చేరినంత మాత్రాన కిషన్ రెడ్డి ఇలా మురిసిపోవడం ప్రారంభిస్తే.. ముందు ముందు పార్టీకి ఇబ్బందే.
అసలు తెలంగాణ బిజెపిలో చేరదలచుకుంటున్న నాయకులు ఎవరైనా ఉన్నారా? అనే సందేహం పలువురికి కలుగుతోంది. ఎందుకంటే- మొన్నటికి మొన్న.. అమిత్ షా స్థాయి నాయకుడిని తెలంగాణకు తీసుకువచ్చి ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే.. ఆ సభలో ఒక్కటంటే ఒక్క నాయకుడి చేరికను కూడా వారు సాధించలేకపోయారు. నిజానికి అది పార్టీకి పరువు నష్టం చేసే విషయం.
అలాగే చెన్నమనేని వికాస్ రావు చేరిక కూడా ఒక డ్రామా ఎపిసోడ్ లాగా జరిగిపోయింది. ఏదో ఆర్భాటం చేయాలని అనుకున్నారే తప్ప.. వికాస్ రావు.. ఇప్పటిదాకా ఏ పార్టీలో ఉన్నారని.. ఇప్పుడు బిజెపిలో చేరికను సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అనేది కీలకాంశం. వికాస్ రావు తండ్రి విద్యాసాగర్ రావు విజెపి సర్కారులోనే ఒక రాష్ట్రానికి గవర్నరు అయ్యారు. ఆయన కరడుగట్టిన బిజెపి వాది. అందుకే ఆయనను ఆ రీతిగా మోడీ సర్కారు సత్కరించింది. ఆ రకంగా వికాస్ రావు కూడా పుట్టుకతో బిజెపికి చెందిన వ్యక్తే.
కానీ అక్కడికేదో సరికొత్త బలం పార్టీకి జత అయినట్టుగా ఆర్భాటంగా ఆయన చేరికను సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఊరంతా ఫ్లెక్సిలు గట్రా వేసి, జనాన్ని కూడా మొబిలైజ్ చేసుకున్నాక.. భారాసనుంచి వచ్చిన నాయకుడు క్రిష్ణయాదవ్ చేరికకు కిషన్ రెడ్డి బ్రేకులు వేశారు.
అలాంటి కిషన్ రెడ్డి ఇప్పుడు చేరికలు త్వరలో ఉంటాయని అనడం చూస్తోంటే.. ఈ పార్టీలోకి, ఇతర పార్టీల్లో గతిలేని వారంతా వచ్చి చేరుతారేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత.. ఆ రెండు పార్టీల్లో మిగిలిపోయిన తాలు సరుకు బిజెపిలోకి వస్తుందని.. అలాంటి రాకలు ఉన్నా లేకున్నా.. ఎమ్మెల్యే ఎన్నికలను ఎదుర్కోవడం కూడా కష్టమని పలువురు అంచనా వేస్తున్నారు.