కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియ వేగం అందుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కలుసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకాలం కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని షర్మిల విలీనం చేస్తారా? లేదా? అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే సోనియా, రాహుల్‌గాంధీలను ఆమె కలవడంతో ఆ చర్చకు తెరపడింది.
ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అసలు ఆమె రాజకీయాన్ని ఎక్కడి నుంచి చేస్తుందనే చర్చకు తెరలేచింది. మరోవైపు కాంగ్రెస్‌లో రాజకీయ భవిష్యత్‌ను షర్మిల చూసుకోవడంపై సొంత పార్టీ ముఖ్య నాయకుడు కొండా రాఘవరెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఈయన వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. షర్మిల సొంత పార్టీ పెట్టడంతో ఆమెకు మొదటి నుంచి అండగా నిలిచారు.
తాజా షర్మిల నిర్ణయాన్ని ఆయన విభేదిస్తున్నారు. ఒక చానల్‌లో చర్చలో పాల్గొన్న ఆయన లైవ్‌లోనే వైఎస్సార్‌టీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీసిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన బాహాటంగానే ప్రకటించారు.
వైఎస్సార్ మరణం తర్వాత ఆయనపై కేసు నమోదు చేసిన కాంగ్రెస్‌లో ఎప్పటికీ చేరనని ఆయన తేల్చి చెప్పడం విశేషం. ఎప్పటికీ వైఎస్సార్ కుటుంబం వెంటే వుంటానని, కానీ కాంగ్రెస్‌లో మాత్రం షర్మిలతో పాటు ప్రయాణం సాగించలేనని ఆయన అన్నారు.