ఇవేం మాట‌ల‌య్యా.. ప్ర‌త్య‌ర్థులు ఓడించ‌క గెలిపిస్తారా?

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంటేనే ఒక‌రినొక‌రు ఓడించ‌డానికి పోటీ ప‌డ‌డం. అదేంటో గానీ, త‌న‌ను ఓడించ‌డానికి బీఆర్ఎస్‌, బీజేపీ చూస్తున్నాయ‌ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కామెంట్స్ చేశారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున…

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంటేనే ఒక‌రినొక‌రు ఓడించ‌డానికి పోటీ ప‌డ‌డం. అదేంటో గానీ, త‌న‌ను ఓడించ‌డానికి బీఆర్ఎస్‌, బీజేపీ చూస్తున్నాయ‌ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కామెంట్స్ చేశారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి బ‌రిలో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి, కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో ఓడిపోవ‌డం, అనంత‌ర కాలంలో తాను అనుకున్న‌ట్టు బీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా బీజేపీ పోరాటం చేయ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ మాతృపార్టీ అయిన కాంగ్రెస్‌లో ఆయ‌న చేరి, మునుగోడు టికెట్‌ను తిరిగి ద‌క్కించుకున్నారు. ఇప్పుడాయ‌న బీజేపీ, బీఆర్ఎస్‌కు టార్గెట్ అయ్యారు. రెండు పార్టీలు క‌లిసి త‌న‌ను ఓడిస్తాయ‌ని ఆయ‌న వాపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌న్న త‌ర్వాత త‌న‌ను గెలిపిస్తాయ‌ని రాజ‌గోపాల్‌రెడ్డి ఎలా అనుకుంటున్నారో మ‌రి! ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌, బీజేపీ ఎప్పుడో ఒక్క‌ట‌య్యాయ‌ని విమ‌ర్శించారు. ఆ రెండు పార్టీలు కుమ్మ‌క్క‌యి కాంగ్రెస్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి చూస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు ఆ రెండు పార్టీల మోసాల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని, త‌గిన స‌మ‌యంలో బుద్ధి చెబుతార‌ని అన్నారు. రాష్ట్రంలో రానున్నది త‌మ ప్రభుత్వమే అని ఆయ‌న అన్నారు. బీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తామని ఆయ‌న హెచ్చ‌రించారు. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమ‌టిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.