నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా!

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్య‌ర్థుల‌కు త‌క్కువేం లేదు. ప్ర‌తి ఒక్క నాయ‌కుడు తాము సీఎం అభ్య‌ర్థి అనుకుంటున్నారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందో, లేదో తెలియ‌దు కానీ సీఎం సీటుపై మాత్రం…

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్య‌ర్థుల‌కు త‌క్కువేం లేదు. ప్ర‌తి ఒక్క నాయ‌కుడు తాము సీఎం అభ్య‌ర్థి అనుకుంటున్నారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందో, లేదో తెలియ‌దు కానీ సీఎం సీటుపై మాత్రం అంద‌రిలో ఆశ‌లు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాను ఎప్ప‌టికైనా సీఎం అవుతాన‌ని, కాపాడుకోవాల‌ని కాంగ్రెస్ శ్రేణుల్ని అభ్య‌ర్థించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో రెడ్డి త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు. న‌ల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ఆయ‌న భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ న‌ల్గొండ నుంచి సీఎం అవుతార‌ని జోస్యం చెప్పారు. ప‌దేళ్ల‌కైనా తాను సీఎం అవుతాన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఇప్ప‌టికిప్పుడే సీఎం కావాల‌నే ఆత్రుత త‌న‌కు లేద‌న్నారు. మాయ మాట‌లు చెప్పి గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గెలిచింద‌న్నారు. ఏపీలో కాంగ్రెస్ న‌ష్ట‌పోతుంద‌ని తెలిసినా తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చార‌న్నారు. పోలింగ్ చివ‌రి రోజు రైతు బంధు ప‌థ‌కం డ‌బ్బుల్ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వేస్తుంద‌ని, అయినా మోస‌పోవ‌ద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సీఎం ప్ర‌క‌ట‌న‌తో కాంగ్రెస్ నేత‌ల కామెంట్స్‌ను ప్ర‌త్య‌ర్థులు ట్రోల్ చేస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అనే చందంగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌ముందే, ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై నాయ‌కులు క‌ల‌లు కంటున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు దెప్పి పొడుస్తున్నారు.