తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో నాయకుడు సెలవు పుచ్చుకున్నట్టే. పార్టీ మీద చాలా కాలంగా ధిక్కార స్వరంమాత్రమే వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బిజెపిలో చేరడానికి డిసైడ్ అయినట్టే. కోమటిరెడ్డి బ్రదర్స్ లో చిన్నవాడైన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉపఎన్నికలో తలపడి భంగపడిన సంగతి తెలిసిందే. పెద్దవాడైన వెంకటరెడ్డి.. తాజాగా ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఏదో అభివృద్ధి కార్యక్రమాల గురించి విన్నపాలు సమర్పించానని అంటున్నారు.
అయితే ప్రధానిని కలిసిన తర్వాత.. తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన పెద కోమటిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తానని తనకు తానే సీటు ప్రకటించేసుకోవడం గమనార్హం. ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది ఎన్నిక సమయంలో చెబుతానని ఆయన కించిత్ సస్పెన్స్ కూడా లేని డైలాగును వల్లించారు. అన్నదమ్ములు ఇద్దరూ బిజెపి తరఫున అసెంబ్లీ బరిలోనే ఉండబోతారని మోడీతో భేటీ ద్వారా తేలిపోయింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలినుంచి రేవంత్ వ్యతిరేకిగా కాంగ్రెస్ లో పోరాడుతూనే ఉన్నారు. రేవంత్ కంటె ముందునుంచి తనకు పీసీసీ పగ్గాలు ఇస్తే.. సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకువెళతానని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయినా ఆయన వినతులను అధిష్ఠానం పట్టించుకోలేదు. రేవంత్ కు పదవి అప్పగించిన తర్వాత.. వెంకటరెడ్డి ధిక్కారస్వరం కొనసాగుతూ వచ్చింది. ఇంచుమించుగా ప్రతిసందర్బంలో పార్టీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారనే చెప్పాలి.
తమ్ముడు పార్టీకి రాజీనామా చేసి కమలతీర్థం పుచ్చుకున్న తర్వాత.. వెంకటరెడ్డి లౌక్యం పాటించారు. బిజెపి అభ్యర్థిగా తమ్ముడిని గెలిపించాలని కొందరు కాంగ్రెస్ నేతలకు ఫోను ద్వారా తెలియజేసి.. ఆడియోరికార్డింగులు లీక్ కావడంతో సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసినప్పటికీ.. స్థానికంగా ఆయన భువనగిరి ఎంపీ అయినప్పటికీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గెలవబోదని ప్రతికూల మాటలతో ప్రెవేటు సంభాషణల్లో వ్యాఖ్యానించినట్టుగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయానికి ఆస్ట్రేలియా వెళ్లిపోయి ప్రచారానికి దూరంగా ఉండిపోయారు.
ఆయనకు పార్టీ షోకాజులు కూడా ఇచ్చింది. ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి కొత్త ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. శుభాకాంక్షలు చెప్పారు. బహుశా వివరణ ఇచ్చారో లేదో తెలియదు గానీ.. పీసీసీ కి ఏర్పాటుచేసిన కొత్త కమిటీల మీద అసంతృప్తిని మాత్రం వెలిబుచ్చారు.
ఖర్గేను కలిసిన రోజుల వ్యవధిలోనే ఆయన మోడీని కలవడం.. వచ్చే ఎన్నికల్లో నల్గొండనుంచి ఎమ్మెల్యేగానే బరిలో ఉంటానని ప్రకటించేయడం జరిగిపోయింది. కాంగ్రెస్ నుంచి నాయకులు వరుసగా వెళ్లిపోతున్న తరుణంలో పెద కోమటిరెడ్డి పోక కూడా ఖరారైనట్టే. ప్రస్తుతం ఎంపీ పదవి ఉన్నది గనుక.. అనర్హత వేటు పడకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారని మాత్రమే అనుకోవాలి.