ప్ర‌జాభిప్రాయం మేర‌కే.. ఆ పార్టీలోకి!

రాజ‌కీయ నాయ‌కుల స్వార్థానికి త‌ర‌చూ ప్ర‌జ‌ల్ని బ‌లి ప‌శువుల్ని చేస్తుంటారు. నోరు తెరిస్తే చాలు ప్ర‌జాభిప్రాయం మేర‌కే నిర్ణ‌యం అంటుంటారు. తాజాగా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారాల‌ని ఒక నిర్ణ‌యానికి…

రాజ‌కీయ నాయ‌కుల స్వార్థానికి త‌ర‌చూ ప్ర‌జ‌ల్ని బ‌లి ప‌శువుల్ని చేస్తుంటారు. నోరు తెరిస్తే చాలు ప్ర‌జాభిప్రాయం మేర‌కే నిర్ణ‌యం అంటుంటారు. తాజాగా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇందుకు ఆయ‌న కామెంట్స్ నిద‌ర్శ‌నం. పార్టీ మార్పున‌కు త‌న అవ‌కాశ‌వాద‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న అంగీక‌రించ‌డానికి సిద్ధంగా లేరు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డే కాదు, ఏ నాయకుడు కూడా ఒప్పుకోడు.

తెలంగాణ‌లో గాలి కాంగ్రెస్ వైపు వీస్తోంద‌ని ఆయ‌న పసిగ‌ట్టారు. దీంతో బీజేపీలో చేరాన‌నే ప‌శ్చాత్తాపం ఆయ‌న‌లో మొద‌లైంది. బీజేపీకి తెలంగాణ‌లో భ‌విష్య‌త్ లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చిన రాజ‌గోపాల్‌రెడ్డి, పార్టీ మార్పునకు ఇంత‌కంటే స‌రైన స‌మ‌యం లేద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ విడుద‌ల చేసిన 52 మంది అభ్య‌ర్థుల జాబితాలో రాజ‌గోపాల్‌రెడ్డి పేరు లేదు. అంటే రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతార‌ని బీజేపీ న‌మ్ముతోంది. అందుకే ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టింది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో చేరిక‌పై రాజ‌గోపాల్‌రెడ్డి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా బీజేపీని వీడుతున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు. ప్ర‌జ‌ల అభిప్రాయ‌మంటూ చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక‌కు, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు చాలా తేడా వుంద‌న్నారు. బీజేపీకి సానుకూల ప‌రిస్థితులు లేవ‌ని ఆయ‌న ప‌రోక్షంగా అంగీక‌రించారు. 

మునుగోడు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయాల‌ని త‌న‌పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌స్తోంద‌న్నారు. కాంగ్రెస్‌లో చేరుతార‌నే ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టి పారేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా త‌న‌ నిర్ణ‌యం వుంటుందన‌క్నారు. కేసీఆర్ కుటుంబ దుర్మార్గ పాల‌న విముక్తి కోస‌మే త‌న‌ పోరాటమ‌న్నారు. కాంగ్రెస్‌లో చేరాల‌ని ప్ర‌జ‌లు ఒత్తిడి చేయ‌డంతోనే ఆ పార్టీలో చేరుతున్న‌ట్టు రేపో ఎల్లుండో ఆయ‌న ప్ర‌క‌టించ‌నున్నారు. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ స‌మ‌క్షంలో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డ‌మే త‌రువాయి అని అంటున్నారు.