మ‌న‌సు ఎక్క‌డుంది సారూ!

మ‌నిషి కాంగ్రెస్‌లో, మ‌న‌సు మాత్రం మ‌రెక్క‌డో. ఇదీ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌రిస్థితి. అన్య మ‌న‌స్కంగా కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఎందుకంటే సాక్ష్యాత్తు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ జోడో యాత్ర‌లో భాగంగా…

మ‌నిషి కాంగ్రెస్‌లో, మ‌న‌సు మాత్రం మ‌రెక్క‌డో. ఇదీ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌రిస్థితి. అన్య మ‌న‌స్కంగా కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఎందుకంటే సాక్ష్యాత్తు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ జోడో యాత్ర‌లో భాగంగా తెలంగాణ‌లో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నా, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పాల్గొన‌లేదు. మ‌రి ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

కానీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వాద‌న మ‌రోలా వుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితం వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారిగా ఆయ‌న మీడియాతో సోమ‌వారం మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డికి మ‌ద్ద‌తుగా ఆడియో ప్ర‌చారం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్‌పై ఆయ‌న స్పందించారు. షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రిత‌మే స‌మాధానం ఇచ్చాన‌న్నారు. అయితే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తారిక్ అన్వ‌ర్ అందుబాటులో లేర‌న్నారు.

షోకాజ్ నోటీసు ఇచ్చాక రాహుల్ పాద‌యాత్ర‌లో ఎలా పాల్గొంటాన‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. క్లీన్ చిట్ వ‌చ్చాకే జోడో యాత్ర‌లో పాల్గొంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి ఓట‌మి వెంక‌ట‌రెడ్డిలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా? ప్ర‌స్తుతం ఎంపీ ప‌ద‌వి కాపాడుకోడానికి కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆయ‌న్ని న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు.

ఎందుకంటే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి వ‌ల్ల కాంగ్రెస్ పార్టీ నాశ‌న‌మ‌వుతోంద‌న్న సంకేతాలు ఇచ్చేందుకే మునుగోడులో స‌హాయ నిరాక‌ర‌ణ చేశార‌నే సంగ‌తి అంద‌రికీ తెలుసు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వైఖ‌రిపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా వుంది. ఎటూ పార్టీలో కొన‌సాగేందుకు ఇష్ట‌ప‌డ‌ని నాయ‌కుడి విష‌యంలో ఉదాసీనంగా ఎందుకు ఉండాల‌ని వెంక‌ట‌రెడ్డి వ్య‌తిరేకులు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో తాను ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నాన‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం ద్వారా… ఆ పార్టీలో మ‌నిషి మాత్ర‌మే ఉన్నార‌ని, మ‌న‌సు కాద‌నే వాద‌న‌ను ఎలా కొట్టి పారేయ‌గ‌లం?