‘సింహం సింగిల్‌గా..’ జనం నమ్ముతారా కేటీఆర్!

వర్తమాన తెలుగురాష్ట్రాల రాజకీయాలలో ‘సింహం సింగిల్ గానే వస్తుంది..’ అనే డైలాగ్ కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వర్తిస్తుంది. మరెవ్వరూ కూడా ఆ మాట చెప్పుకోవడానికి వీల్లేదు. పొత్తుల ఊసు అనేదే లేకుండా..…

వర్తమాన తెలుగురాష్ట్రాల రాజకీయాలలో ‘సింహం సింగిల్ గానే వస్తుంది..’ అనే డైలాగ్ కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వర్తిస్తుంది. మరెవ్వరూ కూడా ఆ మాట చెప్పుకోవడానికి వీల్లేదు. పొత్తుల ఊసు అనేదే లేకుండా.. ప్రజల వద్దకు వెళ్లడం.. వాళ్లు ఆశీర్వదిస్తే గెలవడం, లేకపోతే ఓటమిని అంగీకరించడం అనేది జగన్ తొలినాటినుంచి తన విధానంగా నిర్దేశించుకున్నారు. 

అయితే డైలాగు బాగుంది కదా అని.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ మాట వాడేస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఐక్యం అవుతుండడాన్ని గమనించి.. జడుసుకుంటున్నారో ఏమో గానీ.. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ‘సింహం’ ప్రస్తావన తెస్తున్నారు.

‘కేసీఆర్ సింహం లాంటి వారని.. ఆయన సింగిల్ గానే వస్తారని’ కేటీఆర్ తన ప్రసంగాల్లో వల్లిస్తున్నారు. ఈ డైలాగు కేసీఆర్ గురించి చెబితే జనం నమ్ముతారని కేటీఆర్ ఎలా అనుకుంటున్నారో తెలియదు. మునుగోడు ఉప ఎన్నిక జరిగినప్పుడు, కోమటిరెడ్డిని ఓడించడానికి వామపక్షాల బలం మీద కేసీఆర్ కీలకంగా ఆధారపడ్డారు. 

వామపక్షాలతో భారాస బంధం..కేవలం మునుగోడుతో ముగిసిపోయేది కాదని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అది కొనసాగుతుందని కేసీఆర్ ఘంటాపథంగా, సభాముఖంగా చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత వారికి ముఖం చాటేశారు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒకవైపు వారేమో తాము పొత్తుల్లో ఉన్నామనే అనుకుంటూ ఉండగా, అవమానకరమైన ఆఫర్లతో వారిని బయటకు గెంటేశారు. ఇలా చేయడం అనేది  సింహం సింగిల్ గా వస్తున్నట్టు అనుకోవాలా? అని ప్రజలు అడుగుతున్నారు.

ఇప్పటికీ.. భారాసకు సింగిల్ గా తలపడి, అధికారంలోకి వచ్చే నమ్మకం లేదు. మజ్లిస్ పార్టీ మీద వారు ఎంతగా ఆధారపడుతున్నారో అందరికీ తెలుసు. తాము భారాసకు మిత్రపక్షమేనని ఒవైసీ ఆల్రెడీ ప్రకటించారు. తాము పోటీచేస్తున్న 9 నియోజకవర్గాలు తప్ప రాష్ట్రంలో మిగిలిన అన్నిచోట్ల ముస్లింలు, తమ పార్టీ అభిమానులు భారాసకే ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారా.. దీనిని సింహం సింగిల్ గా రావడం అనుకోవాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చరిత్రలో ఎప్పటికీ మజ్లిస్ ను పక్కన పెట్టి రాజకీయం చేసే ధైర్యం భారాసకు లేదని అంటున్నారు.

అయినా, సింహం ధైర్యం గురించి.. ఈ ఒక్క ఎన్నిక చూసి చెప్పడం సరికాదని, గతంలో తెలుగుదేశంతోనూ, ఇతరులతోను తన అవసరం కోసం పొత్తులు పెట్టుకున్న వైనం మరవకూడదని ప్రజలు అంటున్నారు.