కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తూర్పారపట్టడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందు వరుసలో వుంటారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ చెప్పడానికి, ఆచరణకు తేడా వుంటుండం టీఆర్ఎస్‌కు ఆయుధం దొరికినట్టైంది. పార్లమెంట్‌లో మాట్లాడకూడని పదాలంటూ కొన్నింటిపై నిషేధం విధించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, దాదాగిరీ, విశ్వాస్‌ఘాత్, జుమ్లాజీవీ, శకుని తదితర పదాలపై పార్లమెంట్‌లో నిషేధం విధిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్షాల దాడి నుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా బీజేపీ తాజాగా నిషేధిత జాబితాను తెరపైకి తెచ్చిందని దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలే ఏకిపారేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తన మార్క్ వ్యంగ్యాస్త్రాలతో బీజేపీపై చెలరేగిపోయారు. ఎన్‌పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్) గవర్నమెంట్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇందులో బీజేపీ వాడే పదాలను ప్రస్తావించడం ఆకట్టుకుంది.
ఆందోళనకారులను ఆందోళన్ జీవి అని ప్రధాని మోదీ పిలవడం వారి పార్లమెంట్ భాష అని కేటీఆర్ దెప్పి పొడిచారు.
గోలి మారో సాలోం కో అని ఓ మంత్రి కామెంట్, 80-20 అని యూపీ సీఎం యోగి మతాల ప్రాతిపదికన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్య, మహాత్మా గాంధీని కించపరిచిన బీజేపీ ఎంపీ తీరు, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టిన రైతులను అవమానించేలా టెర్రరిస్టులని సంబోధించడం.. వారి పార్లమెంట్ భాష అని కేటీఆర్ ట్విటర్ వేదికగా దుమ్ము దులిపారు.