బీ టీమ్ కాదంటూనే…ఆయ‌నే సీఎం అంటున్నాడు!

తెలంగాణ‌లో ఎంఐఎమ్‌, బీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఇబ్బందులు త‌లెత్త‌కుండా, బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను నిలువ‌రించేందుకు ఎంఐఎమ్ కీల‌కంగా ప‌ని చేసే సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ…

తెలంగాణ‌లో ఎంఐఎమ్‌, బీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఇబ్బందులు త‌లెత్త‌కుండా, బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను నిలువ‌రించేందుకు ఎంఐఎమ్ కీల‌కంగా ప‌ని చేసే సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లుమార్లు తెలంగాణ మంత్రులు, ఎంఐఎమ్ ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ మ‌ధ్య వాడివేడి సంవాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మంత్రుల‌పై అక్బ‌రుద్దీన్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన సంద‌ర్భాలున్నాయి.

అయితే కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ రెండు పార్టీల మ‌ధ్య సంబంధాల‌పై మ‌రోసారి క్లారిటీ ల‌భించింది. బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే తాప‌త్రాయ‌న్ని అక్బ‌రుద్దీన్ మాట‌ల్లో చూడొచ్చు. మ‌రో ద‌ఫా కేసీఆరే సీఎం అని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇందుకు అసెంబ్లీనే వేదిక కావ‌డం గ‌మ‌నార్హం.

తామెవ‌రికీ బీ టీమ్ కాద‌ని అక్బ‌రుద్దీన్ ఓవైసీ అన్నారు. త‌మ‌ను బీ టీమ్ అంటున్న పార్టీల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ఇదే సంద‌ర్భంలో మ‌రోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇత‌ర రాష్ట్రాల్లో హిందూముస్లింల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూ నాశ‌న‌మ‌వుతున్నార‌న్నారు.

 కానీ తెలంగాణ‌లో మాత్రం సంక్షేమ పాల‌న సాగుతోంద‌ని ప్ర‌శంసించారు. దేశం యావ‌త్తు తెలంగాణ‌ను చూసి నేర్చుకోవాల‌ని ఆయ‌న హిత‌వు చెప్ప‌డం ద్వారా… బీఆర్ఎస్‌తో తామెంత‌గా అంట‌కాగుతున్నామో చెప్ప‌క‌నే చెప్పార‌నే ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. ఎన్నిక‌ల్లో మాత్రం బీఆర్ఎస్‌, ఎంఐఎమ్ స‌ఖ్య‌త‌గా వుంటూ, పాత‌బ‌స్తీలో  ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తూ, మిగిలిన చోట్ల ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయ‌ని బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కోస‌మే ఎంఐఎమ్ ఉంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో అక్బ‌రుద్దీన్ కామెంట్స్ వాటికి బ‌లాన్ని క‌లిగిస్తున్నాయి.