తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య ప్రస్తుతానికి మాటల్లేవు. గతంలో మాత్రం వారు మంచి మిత్రులు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అటు స్టాలిన్, ఇటు కేసీఆర్ ఇద్దరూ హాజరయ్యారు. ప్రస్తుతం స్టాలిన్ తో జగన్ కి సత్సంబంధాలే ఉన్నా.. కేసీఆర్ తో మాత్రం అంటీముట్టనట్టుగా ఉన్నారు.
ఇరు రాష్ట్రాల సంబంధాలు కూడా అంతంతమాత్రమే. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న క్రమంలో జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది..? జగన్, కేసీఆర్ ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా..? ఏపీలో కూడా కేసీఆర్ జాతీయ పార్టీ పోటీ చేస్తుందా..? చేస్తే వైసీపీని మిత్రపక్షంగా భావిస్తుందా..? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా లేదు.
అయితే కేసీఆర్, జగన్ ని కూడా కలుపుకొని వెళ్లినప్పుడే ఫలితాలు బాగుంటాయని అంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని చెప్పారు నారాయణ. అదే సమయంలో ఆయన జగన్ మద్దతు కూడా తీసుకుంటే బాగుంటుందనే హితబోధ చేశారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్, పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని, సరైన జాతీయ విధానంతో ముందుకెళ్లాలని సూచించారు నారాయణ. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రంలో బలంగా ఉన్న సీఎం జగన్ ని కూడా కలుపుకొని వెళ్తేనే.. వారికి ఉత్తరాదిలో పట్టు ఉంటుందని, దేశ రాజకీయాల్లో గ్రిప్ వస్తుందని చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికలతో మొదలు పెట్టాలి..
ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ కాస్త టెన్షన్ తో ఉంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి చుక్కలు కనపడతాయి. ఎన్డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ఓడిపోవడం అసాధ్యం కావొచ్చు కానీ.. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ఎలాంటి ఫలితాలుంటాయనే విషయంలో వారి బలం వారికి తెలిసొస్తుంది.
బీజేపీ అసలు భయమంతా అదే. రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా జట్టుకట్టే పార్టీలు.. రేపు సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలంగా కలసిపోతే, వాటి మధ్య సయోధ్య కుదిరి.. ఎక్కడికక్కడ బీజేపీకి గండికొడితే.. అప్పుడు పరిస్థితులు తలకిందులవుతాయి.
ఇలాంటి షాకులివ్వాలంటే కేసీఆర్, జగన్, స్టాలిన్.. ముగ్గురూ కలవాలి. నారాయణ పరోక్షంగా చెబుతున్న విషయం కూడా అదే. దక్షిణాది రాష్ట్రాల సత్తా తెలియాలంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలపడాలి అంటున్నారు నారాయణ.
ఇటీవల గవర్నర్ ప్రజా దర్బార్ విషయంలో కూడా ఎదురుదాడికి దిగిన నారాయణ, మరోసారి కేసీఆర్ కి మద్దతుగా మాట్లాడటం.. రాబోయే రోజుల్లో గులాబిదండుతో ఎర్రదండు స్నేహాన్ని మాత్రం గుర్తు చేస్తోంది.