కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఏ మాత్రం తట్టుకోలేకపోతోంది. అలాగని జూనియర్ ఎన్టీఆర్‌పై ఏమీ మాట్లాడలేని దుస్థితి.
అయితే తమ అభిప్రాయాల్ని ఇతర పార్టీల నేతలతో గట్టిగా పలకించగల నేర్పరితనం టీడీపీకి వుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ టీడీపీ అదే పని చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌ను పొగుడుతూనే, మరోవైపు నిలదీయడం ఆసక్తికర పరిణామం. ఆ పని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలను తూర్పార పట్టారు.
తెలంగాణలో సినీ నటుల్ని బీజేపీ ప్రసన్నం చేసుకుంటోందన్నారు. సినీ నటుల ద్వారా టీఆర్ఎస్‌ను బలహీనపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉదంతాన్ని ఆయన ప్రస్తావించడం గమనార్హం.
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గొప్ప రాజకీయ చరిత్ర వుందని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సందర్భంలో అమిత్‌షాను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని జూనియర్ ఎన్టీఆర్‌ను నారాయణ ప్రశ్నించడం గమనార్హం.
అమిత్‌షాను ఎవరు కలిసినా తప్పే అన్నట్టు నారాయణ ధోరణి ఉంది. కానీ అమిత్‌షాతో టీడీపీ దోస్తీపై మాత్రం ఆయన ఏ మాత్రం చురుకు తగలకుండా విమర్శిస్తుంటారు. ఇదెక్కడి లాజిక్కో ఎవరికీ అర్థం కాదు. రాజకీయాలతో సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ఎవర్ని కలిస్తే నారాయణకు ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్‌షా కలవగానే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతున్నంతగా ఇతర పార్టీల్లో ఆందోళన కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టీడీపీ ఎక్కువ భయపడుతోంది. టీడీపీ భయాన్ని, ఆందోళనను నారాయణ మాటల్లో ఆ పార్టీ వ్యక్తం చేసిందనే చర్చ జరుగుతోంది.