కులమతాల పీడ వదిలే దిశగా మంచి అడుగు!

  Advertisement కుల మతాల పరంగానే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ కులమతాలను ప్రోత్సహించడానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తుంటాయి.  ప్రజలు సమైక్యంగా కలసిమెలసి ఉండడం రాజకీయ పార్టీలకు…

 

కుల మతాల పరంగానే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ కులమతాలను ప్రోత్సహించడానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తుంటాయి. 

ప్రజలు సమైక్యంగా కలసిమెలసి ఉండడం రాజకీయ పార్టీలకు ఎప్పుడూ నచ్చదు. కులాలు, మతాలు ప్రాతిపదికగా సమాజం మొత్తం చీలికలు, పేలికలుగా మారి కొట్టుకుంటూ ఉంటే.. అలాంటి పరిస్థితులే పార్టీలకు కావాలి. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా సమాజం ముక్కలుగా ఉంటేనే తమ మనుగడ సాధ్యమవుతుందని పార్టీల నమ్మకం. ఇప్పుడు కనీసం భవిష్యత్ తరాల కోసం అయినా కుల మతాలు లేని సమాజాన్ని ఆవిష్కరించేందుకు ఒకఅడుగు ముందుకు పడడం శుభపరిణామం.

పుట్టిన బిడ్డలకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో.. కులం-మతం వద్దనుకునే వారికి వీలుగా ఒకప్రత్యేక కాలమ్ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాన్ని మతాన్ని వదలుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. కులమతాల ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

నిజానికి కులమతాలు లేని సమాజం అనేది చాలా మందికి ఉండే కల. కానీ.. వాటిని వదిలించుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పు చాలా గొప్ప పరిణామం అని చెప్పాలి.

హైదరాబాదులో సందెపు స్వరూప అనే మహిళ కులమతాల ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లయి చేసుకునే వెసులుబాటు కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. కోర్టు దీనిని పిటిషన్ గా మార్చి విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం.. నచ్చిన మతం ఆచరించే హక్కు అందరికీ ఉంటుందని, అలాగే ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడానికి కూడా హక్కు ఉందని తీర్పులో పేర్కొన్నారు.

అయితే బర్త్ సర్టిఫికెట్ విషయంలో ఈ ఏర్పాటు బాగానే ఉంది. అయితే మామూలు వ్యక్తులు కూడా తమ కులమతాలను వదిలించుకుని ఆ మేరకు మరొక ధ్రువపత్రం పొందడానికి, ఆల్రెడీ కుల మతాల సహా బర్త్ సర్టిఫికెట్ ఉన్నవారు వాటిని తొలగించుకుని తిరిగి సర్టిఫికెట్ పొందడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కాలక్రమంలో కులమతాలు లేని సమాజం తప్పకుండా ఆవిష్కృతం అవుతుంది.