సాంకేతిక రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. సమాచార వ్యవస్థ ప్రజలకే చేరువైంది. సెల్‌ఫోన్‌లోనే ప్రపంచమంతా వుంది. సెల్‌ఫోన్ వాడని మనుషులంటూ లేరు. సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం కష్టమైన వ్యవస్థలో బతుకుతున్న పరిస్థితిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం…అబ్బే నేను ఆ పరికరాన్నే ముట్టనని తెగేసి చెప్పారు.
సెల్‌ఫోన్‌ను వాడనని, ఎవరికైనా తనతో పని వుంటే వస్తారని, లేదంటే నలుగురు పీఏలలో ఎవరికో ఒకరికి చేస్తానని, ముఖ్యమైన అంశం వుంటే మాట్లాడ్తానని వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది జనాభాకు తాను తెలుసునని, రోజుకు లక్ష కాల్స్ వస్తే మాట్లాడ్డానికే జీవితం సరిపోదని, ఇక తనకేం పనిలేదా? అని ఆయన ప్రశ్నించారు కూడా. రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా… ఇక రాజకీయ నాయకులెవరూ సెల్‌ఫోన్లు వాడకూడదు.
రేవంత్‌రెడ్డి సెల్‌ఫోన్ వాడకంపై సీరియస్ కామెంట్స్ నేపథ్యంలో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సెల్‌ఫోన్ వాడకపోవడం వెనుక అసలు నిజం వేరే వుందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఫోన్లను ట్యాప్ చేస్తోందనే ఆరోపణ వుంది. గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం వెనుక, ఆయన సెల్‌ఫోన్‌ను ట్యాప్ చేయడమే కారణమని అప్పట్లో టీడీపీ ఆరోపించింది.
తాను చిక్కుల్లో పడడానికి ఫోన్ ట్యాపింగే కారణం కావడంతో, అప్పటి నుంచి దానికి దూరంగా వుండాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండడం, పార్టీలో చేరికలు, సీట్ల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుండడంతో ఫోన్‌పై నిఘా వుంటుందనే భయంతోనే ఆ పరికరానికి దూరంగా వున్నారని సమాచారం.
ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి బయట పెట్టకుండా, ఇతరేతర సంగతులు చెప్పడం ఆయనకే చెల్లింది. అయితే ఓటుకు నోటు చేదు అనుభవంతో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనే టాక్ వినిపిస్తోంది.