వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మరో కేసు నమోదైంది. షర్మిలపై వివిధ సందర్భాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చివరిగా లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుంచి బయటికి వెళుతున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులపై చేయి చేసుకున్నారనే కారణంతో కేసు నమోదైంది. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ సర్కార్‌పై మీడియా సమావేశాల్లోనూ, సోషల్ మీడియాలోనూ దూషణలకు దిగారంటూ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
సీఎం కేసీఆర్‌పై షర్మిల దూషణలకు దిగారని బంజారాహిల్స్ పోలీసులకు బీఆర్ఎస్ నేత నరేందర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఆమెపై అక్కడి పోలీసులు 505(2), 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం. షర్మిలను కేసీఆర్ సర్కార్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. పాదయాత్రలో బీఆర్ఎస్ నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటోందంటూ అనుమతి రద్దు చేశారు.
న్యాయపోరాటం చేసి అనుమతి తెచ్చుకున్నప్పటికీ అడుగులు ముందుకు వేయలేని దుస్థితి. నోరు తెరిస్తే, అడుగేస్తే కేసులన్నట్టుగా షర్మిల పరిస్థితి తయారైంది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వానికి టార్గెట్ అయినప్పటికీ, ప్రజల్లో షర్మిల పార్టీకి తగిన ఆదరణ లేదు.
షర్మిలను ఆంధ్రా నాయకురాలిగానే అక్కడి పౌర సమాజం చూస్తుందనేందుకు, వైఎస్సార్‌టీపీ బలపడకపోవడమే నిదర్శనం. కేసులతోనే షర్మిలకు పుణ్యకాలం సరిపోతోంది. ఇక ఆమె రాజకీయాలు ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే షర్మిలకు సరిపోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుసుకునేందుకు అనుకూల వాతావరణం లేదనే చర్చ నడుస్తోంది.