పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ప్రతీకారం తీర్చుకోడానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి అవకాశం దక్కింది. బీజేపీకి అసదుద్దీన్ బీ టీం అని గతంలో మమతాబెనర్జీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బీహార్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైసీ పార్టీ బరిలో నిలిచింది. ముస్లిం మైనార్టీల ఓట్లను చీల్చి తద్వారా బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగించే కుట్రలో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ తమ అభ్యర్థులను నిలిపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
బీహార్‌లో భారీగా ముస్లిం ఓట్లను చీల్చి నితీశ్‌కుమార్-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు అసదుద్దీన్ పరోక్షంగా దోహదం చేశారు. కానీ పశ్చిమబెంగాల్లో మాత్రం అసదుద్దీన్ పాచిక పారలేదు. ఆ రాష్ట్ర ముస్లిం మైనార్టీలు మమతాబెనర్జీ వెంట నిలిచారు. అప్పట్లో అసదుద్దీన్‌పై మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా మమతాబెనర్జీపై అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు.
ఒకప్పుడు తనను బీజేపీ బీ టీంగా పిలిచిన మమతాబెనర్జీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్, మోదీలను పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మోదీ, అమిత్‌షాల విషయంలో మమతాబెనర్జీ వైఖరిలో మార్పు వచ్చింది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏదో చేస్తానని ప్రగల్భాలు పలికిన మమతాబెనర్జీ, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం తన పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి.
ఇదే ఉపరాష్ట్రపతి ఎన్నికకు వచ్చే సరికి ఆమె తూచ్ అన్నారు. కనీసం ఓటింగ్‌లో కూడా పాల్గొనలేనంతగా ఆమె భయపడ్డారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. బీజేపీ విషయంలో మమతాబెనర్జీ వైఖరి అతివృష్టి, అనావృష్టి రీతిలో తయారైంది. అందుకే మమతాపై అసదుద్దీన్ ఆరోపణలకు దిగడం.