జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీని పోటీచేయించారు? పొత్తు పెట్టుకున్న నాటినుంచి ఎన్నికల ముందు వరకు అసలు జనసేనను ఒక పార్టీగా, పవన్ కల్యాణ్ ను ఒక మనిషిగా కూడా గుర్తించని తెలంగాణ భాజపాతో కలిసి ఎందుకు అడుగులు వేశారు. ఏం సాధించారు? ఈ ప్రశ్నలు ఎవ్వరికైనా చాలా సహజంగా ఎదురౌతాయి. అవును పవన్ కల్యాణ్ నిజంగానే ఏమీ సాధించలేదు.
జనసేనకు ఒక్క సీటు అయినా దక్కుతుందనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి కావడం లేదు. అలాగని రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి కూడా మద్దతివ్వడం వల్ల, భాజపా అభ్యర్థులు పోటీచేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించడంద్వారా.. ఆ పార్టీకి ఏమైనా పవన్ ఉపయోగపడుతున్నారా? అంటే అది కూడా లేదు.
బిజెపి కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఘోరంగా చతికిలపడబోతున్నది. ఈ నేపథ్యంలో.. ఈ ఎన్నికల ద్వారా.. పవన్ స్థూలంగా ఏంసాధించారు? పార్టీకి బిజెపి 8 సీట్లు కేటాయిస్తే.. అందులో బేరం ఉన్న సీట్లను కూడా అమ్ముకోవడం తప్ప పవన్ కు దక్కిందేమీ లేదనే విమర్శలు వినవస్తున్నాయి.
పవన్ కల్యాణ్ పార్టీకి తెలంగాణలో ఠికానా లేదు. అందులో ఎలాంటి సందేహమూలేదు. కాకపోతే, తతిమ్మా అందరికీ ఉన్నట్టే ఆ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో కొందరు కార్యకర్తలు, పవన్ ను నమ్మిన అనుచరులు ఉన్నారు. తెలంగాణ జనసేన తొలుత 31 స్థానాల్లో పోటీచేయాలని కూడా అనుకుంది.
నిజం చెప్పాలంటే.. ఆ పనిచేసిఉంటే పవన్ కు చాలా గౌరవంగా ఉండేది. కనీసం తన పార్టీని నమ్ముకున్న అనేకమందికి ఒకసారి ఎన్నికల్లోపోటీచేసే అవకాశం ఇచ్చినట్టు ఉండేది. గెలుపు దక్కకపోయినా పెద్ద తేడా ఏం రాదు. నమ్మిన వారికోసం పోటీచేశారనే పేరుండేది.
చివరికి ఏమైంది? బిజెపి కేటాయించిన 8 సీట్లలో పోటీచేయడానికి కూడా పవన్ కు అభ్యర్థులు లేరు. అప్పటికప్పుడు బిజెపి నుంచి ఫిరాయించి వచ్చిన వ్యక్తికి కూకట్ పల్లి టికెట్ కేటాయించారు. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా అప్పటికప్పుడు చేరిన కొందరికి పార్టీ టికెట్లు ఇచ్చారు. ఇలాంటి కేటాయింపులు అన్నీ.. టికెట్ అమ్ముకునే బాపతు చర్యలే అనే సంగతి రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు.
పవన్ కు ఒక సీటు రాగానే.. పొరుగు పార్టీనుంచి బీభత్సమైన ప్రజాదరణ ఉన్న నాయకులు ఎగబడి వచ్చి ఈ పార్టీలో చేరితే అదో రకంగా ఉండేది. అలాకాకుండా.. కొత్తగాచేరిన వారికి టికెట్ కేటాయించడం అంటే.. అచ్చంగా అది టికెట్లను అమ్ముకునే వ్యవహారమే. ఇలాంటి పని ద్వారా పవన్ కల్యాణ్ తెలంగాణలో డబ్బులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేశారు అనే అపకీర్తి దండిగా ఆయన ఖాతాలోకి వచ్చింది.
ఇదే మాదిరిగా ఏపీలో కూడా చేస్తారని అంతా అనుకునే ప్రమాదమూ ఉంది. పైగా నమ్ముకున్న కార్యకర్తలను గాలికి వదిలేస్తారనే అభిప్రాయం కూడా ఆయన మీద ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా పవన్ కు మంచి సంకేతాలు కాదు. తెలంగాణలో ఎటూ పార్టీ చితికి పోయినట్టే.. ఏపీ ఎన్నికల పరంగా కూడా ఇవి మంచి సంకేతాలు కాదు.