విచార‌ణ‌కు రండి …రండి సార్‌!

టెన్త్ క్లాస్ పేప‌ర్ లీక్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను టార్గెట్…

టెన్త్ క్లాస్ పేప‌ర్ లీక్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

ఈ లీక్ వ్య‌వ‌హారంలో విచార‌ణ నిమిత్తం రావాలంటూ ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇవాళ సాయంత్రం నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ2 ప్ర‌శాంత్ త‌న వాట్స‌ప్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌శ్న‌ప‌త్రం పంపిన‌ట్టు వ‌రంగ‌ల్ సీపీ రంగ‌నాథ్ తెలిపారు.

వ‌రంగ‌ల్ డీసీపీ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు రావాల‌ని ఈట‌ల‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. విచార‌ణ‌కు వ‌చ్చే ముందు సెల్‌ఫోన్ తీసుకురావాల‌ని కోరారు. సెల్‌ఫోన్‌లో లీక్‌కు సంబంధించి వివ‌రాలు ఉన్నాయ‌ని పోలీసుల భావ‌న‌. విచార‌ణ‌కు వెళ్లాలా? వ‌ద్దా? అనే విష‌య‌మై న్యాయ‌నిపుణుల‌తో ఈట‌ల సంప్ర‌దిస్తున్న‌ట్టు తెలిసింది. పేప‌ర్ లీక్ విష‌య‌మై త‌న‌కు నోటీసు ఇవ్వ‌డంపై ఈట‌ల స్పందించారు.

త‌న‌కు క‌నీసం వాట్స‌ప్ చూడ‌డం తెలియ‌ద‌న్నారు. త‌న‌కొచ్చే ఫోన్‌కాల్స్ మాత్ర‌మే మాట్లాడ్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఫోన్‌ల‌లో మాట్లాడ్డం కూడా త‌ప్పంటే ఎలా అని ప్ర‌శ్నించారు. చ‌ట్టంపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌న్నారు. త‌న సెల్‌ఫోన్‌ను కూడా పోలీసుల‌కు అంద‌జేస్తాన‌న్నారు. త‌న‌కు లీక్ వ్య‌వ‌హారంతో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాన‌ని, న్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. రేప‌టి విచార‌ణపై ఉత్కంఠ నెల‌కుంది.