కేసీఆర్ రుణంతీర్చుకుంటున్న అంబేద్కర్ మనవడు!

భారతదేశంలోనే ఎక్కడా లేనంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంబేద్కర్ పట్ల తమకున్న గౌరవాన్ని చాలా ఘనంగా ప్రకటించారు. నిజానికి సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం…

భారతదేశంలోనే ఎక్కడా లేనంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంబేద్కర్ పట్ల తమకున్న గౌరవాన్ని చాలా ఘనంగా ప్రకటించారు. నిజానికి సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా దళితులను ఆకట్టుకోగల మరో మంచి పనిచేశారు. 

అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆయన చేతులమీదుగానే ఆవిష్కరింపజేశారు. ఆయనను గొప్పగా సత్కరించారు కూడా. ఆ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ.. తన తాత విగ్రహాన్ని ఇంత గొప్పగా ఏర్పాటుచేసినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇప్పుడు మరోసారి కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి ప్రకాష్ అంబేద్కర్ క్రియాశీలంగా రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. ప్రకాష్ అంబేద్కర్ అంటే కేవలం భీమ్‌రావు అంబేద్కర్ మనవడు మాత్రమే కాదు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడు కూడా. ఈ పార్టీకి చట్టసభల్లో పెద్దగా బలం లేదు గానీ.. పార్టీ మాత్రం మనుగడలోనే ఉంది. అలాంటి ఆర్పీఐ పార్టీ తరఫున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో తాము పోటీచేస్తామని ప్రకాష్ అంబేద్కర్ ప్రకటిస్తున్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపాను ఓడించడం లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళుతుందని ప్రకటించారు. బహుజనులంతా ఏకం కావాలని కూడా పిలుపు ఇచ్చారు. భాజపాను ఓడించడానికి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని తేల్చేశారు.

అది గెలిచే పార్టీనా? ఉత్తుత్తి పార్టీనా? అనే సంగతి తర్వాత.. కానీ దళితులకు ప్రత్యేకించిన పార్టీగా పేరున్న, స్వయంగా అంబేద్కర్ మనవడి సారథ్యంలో ఉన్న పార్టీగా ఒక వర్గం ఓటర్లలో ఎంతో కొంత ఆదరణ కలిగి ఉంటుందని అనుకోవచ్చు.  ప్రకాష్ అంబేద్కర్ తన అభ్యర్థులను 119 నియోజకవర్గాల్లో మోహరిస్తే.. అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, కేసీఆర్ కు మేలు చేయడానికే కారణమవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఆర్పీఐ అభ్యర్థులు ప్రతిచోటా పోటీచేయడమే జరిగితే గనుక.. వారికి సగటున వెయ్యేసి ఓట్లు వచ్చినా కూడా అవి కేసీఆర్ ప్రతిపక్షాలకు పడే ఓట్లే అవుతాయని, అంతిమంగా మళ్లీ కేసీఆర్ ను గద్దెమీద కూర్చోబెట్టడానికి ప్రకాష్ అంబేద్కర్ తన శక్తవంచన లేకుండా కృషిచేస్తున్నట్టున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.