కేసుల్లో క్విడ్ ప్రోకో: ఇవి చల్లారుతాయేమో!

నీకు నువ్వు నాకు నేను అని అంటే కాస్త రొమాంటిక్ గా ధ్వనిస్తుంది గానీ.. నిజానికి క్విడ్ ప్రోకో అసలు సూత్రం అదే. నాకు నువ్వు మేలు చేయి.. నీకు నేను మేలు చేస్తా..…

నీకు నువ్వు నాకు నేను అని అంటే కాస్త రొమాంటిక్ గా ధ్వనిస్తుంది గానీ.. నిజానికి క్విడ్ ప్రోకో అసలు సూత్రం అదే. నాకు నువ్వు మేలు చేయి.. నీకు నేను మేలు చేస్తా.. అనేదే క్విడ్ ప్రోకో సిద్ధాంతం. 

సాధారణంగా ఒక డీల్ లో ఉభయపక్షాలు పరస్పరం ప్రయోజనం కలిగించుకునే వ్యవహారానికి ఈ పేరుంటుంది. కానీ కాలక్రమంలో ప్రభుత్వంలో లంచాలు ముట్టజెప్పే వ్యవహారాలకు ఇది అందమైన పేరు అయింది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు లాంటి విషయాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. క్రిమినల్ విషయాల్లో, నేరాల విషయాల్లో కూడా క్విడ్ ప్రోకో ఉండవచ్చు. కానీ మన నాయకులు ఇప్పుడు దానికి నేరరాజకీయాలు, రాజకీయ నేరాలు రూపంలో కొత్త రూపం ఇస్తున్నారు.

తెలంగాణ రాజకీయాలను గమనించినప్పుడు బద్ధ శత్రువులే అయినప్పటికీ బిజెపి-టీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో కుదిరే అవకాశం కనిపిస్తోంది.

ఎమ్మెల్యేలకు ఎర అనే కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బిజెపిలో పెద్ద తల బిఎల్ సంతోష్ కు కూడా నోటీసులు పంపి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన విచారణకు రాకపోయినప్పటికీ.. చాలా సీరియస్ విషయమే అయింది. 

ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి.. అమిత్ అరోడాను అరెస్టు చేసిన ఈడీ ఆ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును కూడా పేర్కొంది. ఆమెతో పాటు మొత్తం 36 మంది పేర్లను ప్రస్తావించారు. పదిమందికి పైగా తెలుగువారున్నారు. ఆల్రెడీ అరెస్టు అయిన అరబిందో శరత్ రెడ్డి మాత్రమే కాకుండా కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు పేర్లుకూడా ఉన్నాయి.

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ తమ ఉచ్చు బిగిస్తోంది. అందులో బిఎల్ సంతోష్ పాత్ర ఉన్నట్టుగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అందుకు రకరకాల కారణాలను వారు చెబుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే.. ఇన్నాళ్లూ కేవలం ఆరోపణల రూపంలో మాత్రమే వినిపించిన కల్వకుంట్ల కవిత పేరు తొలిసారిగా పోలీసు రికార్డులోకి వచ్చింది. ఇప్పుడు ఈడీ కవిత చుట్టూ కూడా తమ ఉచ్చు బిగించే అవకాశం ఉంది.

బిఎల్ సంతోష్ జోలికి మీరు వస్తే.. మేం కవిత జోలికి వస్తాం.. అనేతరహా క్విడ్ ప్రోకో ఒప్పందం ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాల మధ్య కుదురుతుందా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. ఎందుకంటే.. ఎమ్మెల్యేలకు ఎరవంటిదే.. గతంలో చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఓటుకు నోటు కేసుకూడా. ఆ కేసు సంగతి ఏమైందో ఇప్పటికీ అతీగతీ లేదు. అలా ఈ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఒప్పందం కుదిరితే గనుక.. కొన్ని వారాల హడావుడి తర్వాత రెండు కేసులూ నెమ్మదిస్తాయి. 

ఎర గురించి గానీ, ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్ర గురించి గానీ.. పెద్దగా ముందడుగు ఉండదు. వీరి చీకటి ఒప్పందాల మధ్య అమాయకులైన ప్రజలే వెర్రివాళ్లుగా తేలుతారు.