తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. నిన్న బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఇవాళ తెలంగాణలోని మీడియాధిపతులు, మేధావులు, ఉద్యమకారులతో రాహుల్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. హోటల్ తాజ్‌కృష్ణ వేదికగా వివిధ రంగాల ప్రముఖులతో రాహుల్ సమావేశమై, పార్టీ బలోపేతానికి వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
రాహుల్‌తో భేటీకి ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ వెళ్లడం విశేషం. ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌లోనే ప్రముఖంగా క్యారీ చేశారు. గతంలో చంద్రబాబుకు ప్రధాన సలహాదారునిగా ఆర్కే కీలక పాత్ర పోషించారనే ప్రచారం జరిగింది. ఒకవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభంజనాన్ని గుర్తించకుండా, అబద్ధాలు వండివారుస్తూ చంద్రబాబును నిట్టనిలువునా ముంచడంలో ఎవరెవరి పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు చంద్రబాబుతో ఆర్కే నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డ్ సంభాషణ వెలుగు చూసింది. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అభ్యంతర వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల గురించి పరుష పదజాలాన్ని ప్రయోగించి జీతాలు ఇచ్చేందుకే రాష్ట్ర సంపదంతా అంటూ సదరు మీడియాధిపతి కామెంట్ చేయడం చంద్రబాబుపై తీవ్రంగా పడింది.
ఒక దశలో ఆర్కే సలహాలను పరిగణలోకి తీసుకుంటూనే, తనదైన శైలిలో చంద్రబాబు వ్యవహరించడాన్ని ఆ వీడియోలో చూశాం. ఏమో…చెప్పేది చెబుతున్నా, ఇక మీ ఇష్టం అన్నట్టు మీడియాధిపతి నిష్టూరమాడారు.
చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతోందని కథనాలు ప్రసారంతో పాటు ప్రచురించారు. మరీ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా మోదీపై వ్యతిరేక గాలి వీస్తోందని, ఎన్‌డీఏ నుంచి బయటికొచ్చి, ప్రధానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చని సదరు సీనియర్ జర్నలిస్టు, మీడియాధిపతి ఉచిత సలహా ఇచ్చినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చివరికి చంద్రబాబు ఘోర పరాజయాన్ని పొందారు.
ఇవన్నీ తెలిసి కూడా రాహుల్‌తో ఆర్కే భేటీ కాంగ్రెస్ సాహస కార్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులైనప్పటి నుంచి, అతనికి ఆర్కే మీడియా జాకీలు పెట్టి లేపేందుకు యత్నిస్తోంది. అంతెందుకు రాహుల్‌తో తమ అధిపతి భేటీకి సంబంధించిన వార్తను పరిశీలిస్తే, ఎంత సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
వరంగల్‌లో ‘రైతు సంఘర్షణ సభ’ విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్‌లో ఉందని రాశారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత నిర్వహించిన తొలి సభే విజయవంతం కావడంతో టీపీసీసీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోందట! రాహుల్‌గాంధీ ప్రసంగంతో సభకు వచ్చిన జనం ఉత్తేజం పొందారట! చంద్రబాబు మనిషి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తెచ్చేందుకు ఆర్కే మీడియా ప్రయత్నిస్తుండడం అభినందనీయం.
సదరు మీడియాధిపతి సలహాలతో చంద్రబాబు దారుణ ఓటమి మూటకట్టుకున్నారనే ప్రచారాన్ని కూడా లెక్క చేయని తెలంగాణ కాంగ్రెస్‌ను కాపాడేవాళ్లెవరో ఆ దేవునికే తెలియాలి. ఆర్కేను తీసుకెళ్లిన రేవంత్‌రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.