కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఆయన్ని నెట్టేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైరతాబాద్ సర్కిల్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆర్టీసీ బస్సు అద్దాల ధ్వంసం చేశారు. అలాగే ద్విచక్రవాహనాన్ని కాల్చి వేశారు.
రాజ్‌భవన్ వైపు వెళుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు. ఒకదశలో రేణుకా చౌదరి చేయి చేసుకునే వరకూ వెళ్లింది. రాజ్‌భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర చొక్కా పట్టుకుని రేణుకా లాగారు.
రేణుకాను పట్టుకోబోయిన మరో మహిళా కానిస్టేబుల్‌పై కూడా ఆమె చేయి చేసుకున్నారు. పోలీసులపై రేణుకా చౌదరి రెచ్చిపోయారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇస్తూ వీరంగం సృష్టించారు. గతంలో రేణుకా చౌదరి అనేక సందర్భాల్లో ఇదే విధంగా ప్రవర్తించారు. పెద్దావిడ అయినప్పటికీ, తన పాత పద్ధతులు మాత్రం పోలేదని ఆమె మరోసారి నిరూపించుకున్నారు.
రాజ్‌భవన్‌కు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోపం వచ్చింది. రాజ్‌భవన్ వద్ద భట్టి విక్రమార్క తనను అడ్డుకున్న వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్‌ను నెట్టేశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారు. మొత్తానికి కాంగ్రెస్ చాలా ఏళ్ల తర్వాత ఓ రేంజ్లో హల్చల్ సృష్టించింది.