ప‌వ‌న్‌ను రేవంత్ అలా పోల్చాడేంటి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ స్థాయిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అదిరిపోయే సెటైర్ విసిరారు. తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కాపుల ఓట్ల‌తో పాటు సీమాంధ్రుల ఓట్లు రాబ‌ట్టుకోవ‌చ్చ‌నే ఆశ‌తో…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ స్థాయిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అదిరిపోయే సెటైర్ విసిరారు. తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కాపుల ఓట్ల‌తో పాటు సీమాంధ్రుల ఓట్లు రాబ‌ట్టుకోవ‌చ్చ‌నే ఆశ‌తో బీజేపీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ప‌వ‌న్‌తో పొత్తు కోసం వెంప‌ర్లాడుతోంది. అయితే దీని వెనుక టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య విభేదాలు తీసుకొచ్చే కుట్ర దాగి వుంద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవ‌డాన్ని రేవంత్‌రెడ్డి వెట‌క‌రించారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు ప్ర‌జాశాంతి అధ్య‌క్షుడు కేఏ పాల్‌ను కూడా బీజేపీ క‌లుపుకుంటే బాగుండేద‌ని సెటైర్ విసిరారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో కేఏ పాల్‌కు రాజ‌కీయంగా ఎంత కెపాసిటీ వుందో, ప‌వ‌న్‌కు కూడా అదే బలం ఉన్న‌ట్టు ప‌రోక్షంగా దెప్పి పొడిచారు. ప‌వ‌న్ సినీ గ్లామ‌ర్‌, అలాగే ఆయ‌న సామాజిక వ‌ర్గం బ‌లాన్ని రేవంత్ అస‌లు ప‌ట్టించుకోలేదు.

తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక క‌మెడియ‌న్ అని చెప్ప‌క‌నే చెప్పారు. అలాంటి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీని అవ‌హేళ‌న చేశారు. మ‌రోవైపు తెలంగాణ‌లో జ‌న‌సేన బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను గుర్తించి, వాటిని కేటాయించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తెలంగాణ బీజేపీ నేత‌ల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ రాత్రికి హైద‌రాబాద్‌కు అమిత్ షా హైద‌రాబాద్ రానున్నారు. ఈ లోపు జ‌న‌సేన రాజ‌కీయంగా బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను గుర్తించే ప‌నిలో టీబీజేపీ వుంది.

తెలంగాణ‌లో ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకోవాల‌నే నిర్ణ‌యంపై బీజేపీలోనే వ్య‌తిరేక‌త వుంది. ఏపీలోనే రాజ‌కీయంగా బ‌లంగా లేని జ‌న‌సేన‌తో తెలంగాణ‌లో త‌మ పార్టీ ఎందుకు క‌లిసి వెళ్లాల‌ని అనుకుం టుందో అర్థం కావ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. అస‌లు బీజేపీ వ్యూహం ఏంటో తెలియ‌డం లేద‌ని, అందువ‌ల్ల జ‌న‌సేన‌తో పొత్తుపై వ్యాఖ్యానించ‌లేకున్నామ‌ని బీజేపీ అధికార ప్ర‌తినిధులు చెబుతున్నారు. 

ప‌వ‌న్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత‌లే పెద‌వి విరుస్తున్న సంద‌ర్భంలో, ఇక రేవంత్‌రెడ్డి వెటక‌రించ‌డాన్ని పెద్ద విష‌యంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌ను పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ కేఏ పాల్‌తో పోల్చ‌డంపై జ‌న‌సేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. మ‌రీ అంత చుల‌క‌న చేయాలా? అని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి లేద‌ని తెలిస్తే… ఆంధ్రాలో టీడీపీ నుంచి కూడా ఇలాంటి కామెంట్సే వ‌స్తాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.