తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరికించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు కోరుకుంటున్నట్టుగా విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ పరిధిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఖుషీ అవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు విచారణ బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని ఈడీ రెండు రోజులు విచారించింది. ఫిర్యాదుదారుడినైన తనను విచారించడం ఏంటని రోహిత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
ఇందులో భాగంగా ఇవాళ మరోసారి విచారణకు రావాలని రోహిత్‌రెడ్డిని ఈడీ కోరింది. కానీ తాను విచారణకు రాలేనని ఈడీకి రోహిత్‌రెడ్డి మెయిల్ పంపడం గమనార్హం. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన కారణంగా విచారణకు హాజరు కాలేనని సదరు దర్యాప్తు సంస్థ దృష్టికి రోహిత్‌రెడ్డి తీసుకెళ్లారు. తెలంగాణ హైకోర్టులో బుధవారం రోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనుంది. తీర్పు ఏంటో తేలిన తర్వాతే విచారణపై నిర్ణయం తీసుకుంటానని రోహిత్‌రెడ్డి ఈడీకి స్పష్టం చేయడం గమనార్హం.
గతంలో కూడా ఈడీ విచారణకు రాలేనంటూ తన పీఏ ద్వారా ఈడీకి లేఖ పంపిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ లేఖను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందే అని ఈడీ తేల్చి చెప్పింది. దీంతో ఆయన మధ్యాహ్నం తర్వాత ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఇలా రెండు రోజులు రోహిత్‌రెడ్డిని విచారించి పలు కీలక అంశాలపై వివరాలు రాబట్టింది. మరోసారి విచారణ అనడంతో రోహిత్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా వుండగా ఈడీకి తాను ఎలాంటి మెయిల్ పంపలేదని ఆయన చెప్పడం కొసమెరుపు.