ష‌ర్మిల‌ను బ‌హిష్క‌రించాల్సిందే అంటున్న‌ ‘సాక్షి’!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల విష‌యంలో సాక్షి మీడియా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆమెకు సంబంధించిన నెగెటివ్ వార్త‌ల్ని దాచి పెట్టాల‌ని సాక్షి ఏ మాత్రం అనుకోవ‌డం లేదు. మిగిలిన మీడియా సంస్థ‌ల మాదిరిగానే, సాక్షి…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల విష‌యంలో సాక్షి మీడియా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆమెకు సంబంధించిన నెగెటివ్ వార్త‌ల్ని దాచి పెట్టాల‌ని సాక్షి ఏ మాత్రం అనుకోవ‌డం లేదు. మిగిలిన మీడియా సంస్థ‌ల మాదిరిగానే, సాక్షి కూడా ష‌ర్మిల‌పై వ్య‌తిరేక వార్త‌ల్ని ప్ర‌చురించ‌డం గ‌మ‌నార్హం. దివంగ‌త వైఎస్సార్ చిరున‌వ్వుతో నిత్యం సాక్షి ప‌త్రిక ప్ర‌చురిత‌మైంది. అలాంటి ప‌త్రిక‌లో ఆయ‌న ముద్దుల కూతురికి వ్య‌తిరేకంగా మాట్లాడిన వార్త‌కు చోటు ద‌క్క‌డాన్ని చూస్తే…మేనేజ్‌మెంట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌లే వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై ష‌ర్మిల ఫైర్ అయ్యారు. తాను పార్టీ పెట్టిన‌ప్పుడు ఎలాంటి సంబంధం లేద‌ని స‌జ్జ‌ల చెప్పార‌ని, మ‌రి ఇప్పుడు సంబంధం క‌లుపుకోవాల‌ని అనుకుంటున్నారా? లేక ఏ సంబంధం వుంద‌ని త‌న రాజ‌కీయ పంథాపై మాట్లాడుతున్నార‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. వాళ్ల ప‌నేదో చూసుకోవాల‌ని, త‌న విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌తో త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేద‌నే సంకేతాలు పంప‌డానికి సాక్షి యాజ‌మాన్యం ఆమెకి సంబంధించిన నెగెటివ్ వార్త‌ను ప్ర‌చురించింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుని కాంగ్రెస్‌కు ష‌ర్మిల బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల నిర్ణ‌యాన్ని ఆమె పార్టీ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో వైఎస్సార్‌టీపీ నాయ‌కుడు గ‌ట్టు రామ‌చంద్ర‌రావు నేతృత్వంలో పార్టీ నాయకులు మీడియా స‌మావేశంలో మాట్లాడారు. పార్టీకి మూకుమ్మ‌డిగా రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అలాగే ష‌ర్మిల గో బ్యాక్ అంటూ నిన‌దించారు. తెలంగాణ అంశంతో వైఎస్సార్‌టీపీ పేరుతో పార్టీ పెట్టి కార్య‌క‌ర్త‌ల్ని న‌మ్మించి మోస‌గించిన వైఎస్ ష‌ర్మిల‌ను తెలంగాణ నుంచి బ‌హిష్క‌రిస్తున్నామ‌ని నేత‌లంతా ముక్త కంఠంతో హెచ్చ‌రించారు. తెలంగాణ‌లో వైఎస్సార్‌కు ఉన్న మంచిపేరును ష‌ర్మిల చెడ‌గొట్టార‌ని మండిప‌డ్డారు. భ‌విష్య‌త్‌లో ఎక్క‌డ పోటి చేసినా రాళ్ల‌తో కొట్టి ఆంధ్రాకు పంపిస్తామ‌ని వారంతా హెచ్చ‌రించారు.

ఈ వార్త‌కు సంబంధించి “తెలంగాణ నుంచి వైఎస్ ష‌ర్మిల‌ను బ‌హిష్క‌రిస్తున్నాం” అనే శీర్షిక‌తో సాక్షి ప‌త్రిక ఫొటోతో స‌హా వార్త‌ను క్యారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ వార్త సాక్షి ప్ర‌చురించ‌డం వెనుక ఉద్దేశం…మీడియా సంస్థ‌గా ష‌ర్మిల‌ను త‌మ నాయ‌కురాలిగా గుర్తించ‌డం లేద‌ని, ఆమెను బ‌హిష్క‌రిస్తున్నామ‌నే సంకేతాల్ని పంపిన‌ట్టైంది. సాక్షి మీడియా ఎవ‌రి నేతృత్వంలో న‌డుస్తున్న‌దో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.