స‌జ్జ‌ల‌కే కాదు.. జ‌గ‌న్‌కైనా ఇదే ఆన్స‌ర్ః ష‌ర్మిల ఫైర్‌!

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. మీ క‌థేంటో, మీ రాష్ట్రంలో చూసుకోవాల‌ని ఆమె హిత‌వు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాగే స‌జ్జ‌ల మాట్లాడితే, జ‌గ‌న్ అన్న‌ట్టే…

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. మీ క‌థేంటో, మీ రాష్ట్రంలో చూసుకోవాల‌ని ఆమె హిత‌వు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాగే స‌జ్జ‌ల మాట్లాడితే, జ‌గ‌న్ అన్న‌ట్టే అని, మీరేమంటార‌ని మీడియా ప్ర‌శ్న‌కు ష‌ర్మిల షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుని కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు వైఎస్ ష‌ర్మిల ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాను పోటీ చేస్తే ఓట్లు చీలి బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆమె అన్నారు. మ‌రీ ముఖ్యంగా పాలేరులో కాంగ్రెస్ అభ్య‌ర్థి పొంగులేని శ్రీ‌నివాస్‌రెడ్డి మొద‌టి నుంచి త‌న‌కు అండ‌గా నిలిచార‌ని, గ‌తంలో పాద‌యాత్ర చేసిన‌ప్పుడే ప‌క్క‌నే నిలిచార‌ని, అలాంటి వ్య‌క్తికి వ్య‌తిరేకంగా పోటీ చేయ‌డం ఇష్టం లేద‌ని ఆమె అన్నారు. విజ‌యం కంటే త్యాగం గొప్ప‌ద‌ని పోటీ నుంచి త‌ప్పుకోవడాన్ని ఆమె స‌మ‌ర్థించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు ష‌ర్మిల మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందిస్తూ…. అది ఆమె పార్టీకి సంబంధించిన విష‌య‌మ‌న్నారు. వైఎస్ జ‌గ‌న్‌పై కాంగ్రెస్‌, టీడీపీ క‌లిసి కేసులు పెట్టి వేధించాయ‌నేది త‌మ అభిప్రాయ‌మ‌న్నారు. స‌జ్జ‌ల కామెంట్స్‌పై ఇవాళ ష‌ర్మిల ఘాటుగా స్పందించారు. ష‌ర్మిల ఏమ‌న్నారో ఆమె మాట‌ల్లోనే….

“నేను తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన మొట్ట‌మొద‌టి రోజే సంబంధం లేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు ఏ సంబంధం వుంద‌ని నా గురించి ఆయ‌న మాట్లాడుతున్నారు. నేనైతే సంబంధం లేద‌నే అనుకుంటున్నా. మీరు (స‌జ్జ‌ల‌) మాట్లాడుతున్నారంటే, మ‌ళ్లీ సంబంధం క‌లుపుకుంటున్నారా? సంబంధం ఉంది అనా? ఏమ‌నుకోవాలి? స‌జ్జ‌ల స‌మాధానం చెప్పాలి. అస‌లు కేసీఆర్ గారు బ‌హిరంగంగానే సింగిల్ రోడ్డు వుంటే ఆంధ్రా, డ‌బుల్ రోడ్డైతే తెలంగాణ , చీక‌టైతే ఆంధ్రా, వెలుగైతే తెలంగాణ అని అన్నారు. మ‌రి దానికి స‌మాధానం ఏంటి స‌జ్జ‌ల‌? ముందు మీ క‌థ మీరు చూసుకోండి సార్ అని ష‌ర్మిల హిత‌వు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా సజ్జ‌ల మాటంటే వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయంగానే ప‌రిగ‌ణించాల‌ని, ఏమంటార‌ని ష‌ర్మిల‌ను మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించారు. “ఎవ‌రికైనా ఇదే స‌మాధానం” అని ఆమె ఘాటుగా స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న విష‌యంలో జోక్యం చేసుకుంటే అన్నైనా, స‌జ్జ‌లైనా ఖాత‌రు చేయ‌న‌ని ష‌ర్మిల నేరుగానే సంకేతాలు పంపిన‌ట్టైంది.