ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందా?

మనది పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలకులు ప్రజాస్వామికంగా వ్యవహరించడంలేదు. ఈ వైఖరి ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. చాలా రాష్ట్రాల్లో ఇదే ధోరణి. ఇతర రాష్ట్రాల విషయం పక్కన పెడదాం. తెలుగు…

మనది పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలకులు ప్రజాస్వామికంగా వ్యవహరించడంలేదు. ఈ వైఖరి ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. చాలా రాష్ట్రాల్లో ఇదే ధోరణి. ఇతర రాష్ట్రాల విషయం పక్కన పెడదాం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ధోరణి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రజలు, ప్రతిపక్షాలు ఏదైనా విషయంలో నిరసన తెలిపితే, ప్రదర్శనలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు  చేస్తే పాలకులు ఉక్కు పాదం మోపుతున్నారు. కానీ వాళ్ళు కూడా ఇలాంటివి చేసే అధికారంలోకి వచ్చారు. కానీ ఆ సంగతి మర్చిపోయారు. 

ఇక అసలు విషయానికొస్తే ….మొన్నటివరకు ఆంధ్రా మహిళ (వైఎస్ షర్మిల) తెలంగాణలో రాజకీయాలు ఎద్దేవా చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఆమె క్రమంగా ఏకు మేకవుతున్నట్లు కనబడుతున్నారు. ఆగిపోయిన తన పాదయాత్రకు తిరిగి అనుమతి ఇవ్వనందుకు నిరసనగా ఆమె చేస్తున్న నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. 

షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉండగా నర్సంపేటలో చోటు చేసుకున్న గొడవతో పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే దీనిపై షర్మిల హైకోర్టుకు వెళ్లగా పాదయాత్రకు అనుమతినిచ్చింది. అయితే పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించి పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. దీనితో ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన షర్మిల అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది.

కానీ ట్రాఫిక్, శాంతి భద్రతల దృష్యా పోలీసులు షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి లోటస్ పాండ్ కు తరలించారు. కానీ ఆమె అక్కడే దీక్షకు కూర్చుంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే పార్టీ నాయకులను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అప్పటివరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకునేది లేదని షర్మిల పట్టుబట్టింది. వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు లోటస్ పాండ్ లో కొనసాగుతోంది. నిరాహార దీక్షలో ఉన్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ టెస్ట్ చేసిన అపోలో డాక్టర్ చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది.

కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని, ఇలాగే కొనసాగితే దీని ప్రభావం కిడ్నీలపై పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. లోటస్ పాండ్  చుట్టూ పోలీసులు అష్ట దిగ్బంధనం చేసారు. పార్టీ కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. 

బొల్లారం పోలీస్ స్టేషన్ లో 40 మంది ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏడుగురిని అరెస్ట్ చేసి ఉంచారు. ఈ క్రమంలో షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. తమ నాయకులను వదిలిపెట్టి పాదయాత్రకు అనుమతివ్వాలని షర్మిల భీష్మించుకు కూర్చుంది.