తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఓ విలువైన ప్రశ్న సంధించారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం ఏపీ సీఎం జగన్‌కో న్యాయం, తెలంగాణకు మరో న్యాయం అన్నట్టు వ్యవహరించిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల కోడ్ పేరుతో సచివాలయ ప్రారంభానికి ఈసీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఇదే ఏపీ విషయానికి వస్తే… ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
కడప జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో వుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే తమ రాష్ట్ర కొత్త సచివాలయాన్ని 17వ తేదీ ప్రారంభిస్తామని ముందే చెప్పామని, ఇప్పుడు ఎన్నికల కోడ్ పేరుతో ఈసీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఏపీలో జగన్‌కు అనుమతి ఇచ్చారనే ఈర్ష్య లేదని, కేవలం వ్యవస్థ ఎలా పని చేస్తున్నదో చెప్పడానికి మాత్రమే ఉదహరిస్తున్నట్టు ఆయన అన్నారు.
తాము సచివాలయం కట్టడం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ అంటోంది. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ నువ్వానేనా అంటూ తలపడుతున్నాయి. ఏ చిన్న అవకాశం చిక్కినా రాజకీయంగా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తోందని ప్రజానీకానికి చెప్పడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేయాల్సింది పోయి… కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉందన్నట్టు బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది.